Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ అజీజ్ పాషా
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు. వక్ఫ్ భూములను రక్షించేందుకు ఎండోమెంట్ తరహాలో వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత తంజీమ్ -ఏ-ఇన్సాఫ్, దక్కన్ వక్ఫ్ ప్రొటెక్షన్ సొసైటీ, అఖిల భారత ఆవాజ్ కమిటీ, అఖిల భారత ముస్లిం మైనారిటీ సంస్థలు సంయుక్తంగా ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించాయి. ఈ సందర్బంగా అజీజ్ పాషా మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో దశాబ్దాలుగా అవినీతి, దుర్వినియోగం, అవకతవకల కారణంగా రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో విలువైన వక్ఫ్ ఆస్తుల ధ్వంసం, భారీ ఎత్తున భూముల ఆక్రమణ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవకతవకలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సీఐడీ విచారణ మరింత వేగవంతం చేయాల్సిన అవసరముందన్నారు. కోట్లాది రూపాయల విలువైన 80 శాతంపైగా వక్ఫ్ భూములు ఇప్పటికే భూమాఫియా కబంధహస్తాల్లోకి చేరా యని, వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు లేనందున ఈ ఆక్రమణలను తొలగించే పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ దేవాదాయ శాఖకు న్యాయపరమైన అధికారాలు కల్పించినట్టుగా తెలంగాణ వక్ఫ్ బోర్డుకు కూడా న్యాయపరమైన అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో అఖిల భారత మైనారిటీ సంస్థల సలహాదారులు ఎంఏ.సిద్ధికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉస్మాన్ ఆల్ హాజీరి, ఆవాజ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎండి.అలీ, అఖిల భారత మైనారిటీ సంస్థల అధ్యక్షుడు ముఖ్తర్ హుస్సేన్, సంఘ సేవకురాలు డా. నస్రీన్ సుల్తానా, ప్రాఫెసర్ అన్వార్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.