Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలే మైనార్టీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం
- తక్షణమే మైనార్టీ బంధు ప్రకటించాలి
- రూ.5 లక్షల లోన్ ఇచ్చి వారి ఉపాధికి సహకరించాలి : ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అబ్బాస్
నవతెలంగాణ- సిటీబ్యూరో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని, బోర్డులకు చైర్మెన్లను నియమించి కాలం వెళ్లదీస్తున్నాయని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ విమర్శించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, వక్ఫ్‌బోర్డు ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. గురువారం ఆవాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లిలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. దీనికి నగర కార్యదర్శులు అబ్దుల్ సత్తార్, మహమ్మద్ అలీ అధ్యక్షత తవహించారు. ఈ సందర్భంగా మహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఉర్దూ అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, వక్ఫ్‌బోర్డు, హజ్ హౌస్‌కు చైర్మెన్లను నియమించి ప్రభుత్వం కాలం గడుపుతుందని, ఆయా రంగాల్లో ఎలాంటి అభివృద్ధీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, అనేక వెనుకబడిన వర్గాలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సర్కారు.. ముస్లిం మైనార్టీలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రంగనాథ్ మిశ్రా మిషన్ సచర్ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. ముస్లిం మైనార్టీల విద్య, వైద్యంపై దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దళిత బంధు మాదిరిగానే మైనార్టీ బంధు ప్రకటించడంతోపాటు వారి అభివృద్ధికి రూ.5 లక్షల లోన్ ఇచ్చి బతకడానికి సహకరించాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. కేవలం మైనార్టీల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు.. తప్ప వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. వక్ఫ్‌బోర్డు బలోపేతానికి జ్యూడీషియల్ పవర్ ఇస్తామని, బోర్డు భూముల్ని రక్షించి మైనార్టీల అభివృద్ధికి తోడ్పడుతామని స్వయంగా సీఎం కేసీఆర్ అనేకసార్లు వాగ్దానాలు చేసినా అమలుకు నోచుకోవడం లేదన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను బలోపేతం చేసి మైనార్టీలకు రూ. 5లక్షల రణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జిల్లా కార్యదర్శి మహ్మద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్, ముషీరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఖాజాగరీబ్ నవాజ్, నాయకులు గులాం నసీర్, ఎండీ. అలీ మహమ్మద్ లాయఖ్ అలీ, మొహమ్మద్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.