Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-ఖానాపురం
ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ వల్ల రోధనే మిగిలింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, తూడి ప్రతాపరెడ్డి, కామిశెట్టి గాంధీ, వెంపాల వెంకటరెడ్డి సంబంధించిన సుమారు 10 ఎకరాల్లో పండించిన పంటను కోయగా సుమారు 280 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. దాని విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుంది. ఆ ధాన్యంను స్థానిక ఎన్హెచ్-365 రోడ్డుపై ఆరబోశారు. కాగా, గురువారం ఉదయం 6 గంటలకు రోడ్డు పక్కనున్న మిషన్ భగీరథ పైపు లైన్ ఎయిర్వాల్స్ వద్ద ఒక్కసారిగా లీకేజీ కావడంతో ధాన్యం నీటిలో కొట్టుకుపోయి కాలువ పాలైంది. కొంత ధాన్యం తడిసి ముద్దయింది. బాధిత రైతులను విచారించగా మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే పైప్ లైన్ లీకేజ్ జరిగిందని, పైప్ లైన్ పై అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఏయిర్వాల్స్ వద్ద లీకేజీ జరిగిం దని తెలిపారు. అనంతరం నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత రైతులను పరామర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, నష్టపోయిన బాధిత రైతులను అందుకొని ప్రభుత్వం తరపున నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే వెంట ఓడీసీఎంఎస్ చైర్మెన్ రామస్వామి నాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట రామనరసయ్య, బోడపూలు, శాఖమూరి హరిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు ఉన్నారు.