Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ లేదా మేలో పరీక్ష
- వైద్య కళాశాలల్లోని 3,897 ఖాళీల భర్తీకి ఉత్తర్వులు
- త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్..?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతున్నది. గురువారం 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ జారీ చేయటంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. మరోవైపు వైద్య కళాశాలలకు సంబంధించిన 3,897 పోస్టుల(ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు) భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేయటంతో వాటి కోసం ఎదురు చూస్తున్న వారు పిపరేషన్కు సిద్ధమవుతున్నారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడబోతున్నదనే ప్రచారం కూడా జరుగుతుండటంతో ఆయా అభ్యర్థులు సైతం పరీక్షలకు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్ల తేదీలు ఖరారు కావటంతో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన యువతీ యువకులు కొలువులను ఒడిసిపట్టేందుకు గ్రౌండ్లో కుస్తీలు పడుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల సమయం కావడంతో మరిన్ని నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఊపందుకున్నది. ఈ నేపథ్యంలో వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ జార విడుచుకోవద్దని నిరుద్యోగులు భావిస్తున్నారు. అందుకోసం వారు రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నారు. చదువుకు ఎక్కడా అంతరాయం కలుగకుండా ఉండేందుకు వీలుగా స్టడీ రూముల్లో రోజుకు 12 నుంచి 15 గంటల వరకు పుస్తకాలు తిరగేస్తూ కుస్తీలు పడుతున్నారు. గ్రంథాలయాలను వినియోగించుకుంటూ కోచింగ్ సెంటర్లకు వెళుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఏప్రిల్ లేదా మేలో గ్రూప్-4 పరీక్ష
9,168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
టీఎస్పీఎస్సీ వెల్లడి
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. అందులో భాగంగా 9,168 గ్రూప్ -4 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు తుది గడువు వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఉందని వివరించారు. 2023, ఏప్రిల్ లేదా మేలో గ్రూప్-4 రాతపరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విద్యార్హతలు, ఖాళీలు, వయస్సు, జీతం, రిజర్వేషన్ కేటగిరీల వారీగా పూర్తిస్థాయి వివరాలను ఈనెల 23న ప్రకటిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా గతనెల 26న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రూప్-4లో మరో నాలుగు రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులను చేర్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్లో మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,863, పంచాయతీరాజ్ శాఖలో పోస్టులు 1,245, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి. గ్రూప్-2లో 663 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు.
ఒక్కో కాలేజీ, అనుబంధ హాస్పిటల్ కోసం 433 పోస్టుల మంజూరు
ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ
జిల్లాకొక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ వైద్యంతో పాటు వైద్య విద్యను పటిష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మరో తొమ్మిది మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో మెడికల్ కాలేజీకి వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయ శంకర్ భూపాల పల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ మెడికల్ కాలేజీలకు, వీటి అనుబంధ ఆస్పత్రుల కోసం ప్రభుత్వం పోస్టులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రారంభించిన 12 మెడికల్ కాలేజీలు సహా, కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల కోసం ఇప్పటి వరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 15,476 పోస్టులు మంజూరు చేసింది.
ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్లగొండ, సూర్యాపేటలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను ఎనిమిదేండ్లలో ఐదు నుంచి 17కు పెంచారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో అదనంగా 1,150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850గా ఉన్న ఎంబీబీఎస్ సీట్లు, ఈ ఏడాదికి 2,790కి పెరిగాయి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంలో భాగంగా, వచ్చే ఏడాది మరో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది.
ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ అడుగులు:మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి
'అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం, వైద్యను అందించే లక్ష్యంలో ఇదొక ముందడుగు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఒకవైపు నాణ్యమైన వైద్యం, మరో వైపు వైద్యవిద్య రాష్ట్ర ప్రజలకు చేరువవుతున్నది. నాడు పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన స్పెషాలిటీ వైద్యం జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటంతో గ్రామీణ ప్రజలకు చేరువైంది. తద్వారా పేదలకు సమీపంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతుండటంతో పాటు వైద్యం కోసం చేసే ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు డాక్టర్ కావాలని కలలుకనే విద్యార్థులకు, స్థానికంగా ఉంటూనే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు మెరుగుపడ్డాయి' అని ..... హరీశ్ రావు ట్వీట్ చేశారు.