Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1544 కోట్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి
- మునుగోడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- త్వరలో చండూర్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రజలను గుండెల్లో పెట్టుకుంటాం.. వారికి పూర్తి అండగా ఉంటామని ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం మునుగోడు మండల కేంద్రంలో మంత్రులు, ఉమ్మడి జిల్లా అధికారులతో ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను సమిష్టి బాధ్యతగా తీసుకొని ఏడాదిలో పనులు పూర్తిచేసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రూ.1544కోట్లను 12 నియోజకవర్గాల్లో ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ దిక్సూచిగా సీఎం కేసీఆర్ నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. వరి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంటే, తెలంగాణలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఆరేడు నెలల్లో రూ.402కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేస్తామన్నారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖ తరఫున రూ.700కోట్లు, మున్సిపల్ శాఖ తరఫున 19 మున్సిపాలిటీల పరిధిలో రూ.334కోట్లు ఖర్చు చేయడంతో పాటు అదనంగా గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తండాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.100కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ప్రత్యేకంగా మునుగోడు నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రహదారులు, రూ.175 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా అభివృద్ధి, చండూరు మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఐదు కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అందుకు రూ.8కోట్లు విడుదల చేస్తున్నామన్నారు.
ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. దండు మల్కాపూర్ ఇండిస్టియల్ పార్కులో టై పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుతో పదివేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. త్వరలో చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నారాయణపురం మండలంలో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మూడు హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.
ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జెడ్పీచైర్మెన్లు బండ నరేందర్ రెడ్డి, దీపికా యుగంధర్, ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, డి.రవీంద్ర కుమార్, ఎన్.భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, శానంపుడి సైదిరెడ్డి, ఫైళ్ళ శేఖర్ రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ, కలెక్టర్లు టి.వినరు కృష్ణారెడ్డి, పమేలా సత్పతి, హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.