Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆరు నుంచి ఎనిమిదో తరగతిలోపు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇవ్వబోమంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం సరైందికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేద విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు వారి చదువుకు ఎంతో కొంత ఉపశమనంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్యను సాకుగా చూపి కేవలం తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకే ఈ స్కాలర్షిప్లను పరిమితం చేసే విధంగా కేంద్రం కుట్ర పన్నిందని విమర్శించారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు చదువులకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. దేశం వంద శాతం అక్షరాస్యత సాధించాలంటూ ఒకవైపు చెబుతూనే ఇలాంటి ప్రమాదకర నిబంధనలు తేవడంతో లక్ష్యం నెరవేరదని సూచించారు. ఈక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.