Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ క్రిప్టో కరెన్సీ పేరుతో దోపిడీ
- మహిళలే టార్గెట్‌గా మోసం
- అకౌంట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు
- తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ దందా
- ఆకర్షణీయ ఆఫర్లతో బురిడీి
- రూ.వందల కోట్లలో దోచుకున్న వైజాగ్ కేటుగాడు!
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
డోర్నకల్‌కు చెందిన మాదేశ్... కొత్తగూడెం వాసి వెంకటేశ్... ఖమ్మం నివాసి రవి.... మహబూబాబాద్‌లో ఓ మహిళ... భద్రాద్రిలో మరో మహిళ... ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా...రాష్ట్రాల్లో ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు...అందునా మహిళలను టార్గెట్ చేసుకుని ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున ఏకంగా 40 లక్షల మంది నుంచి రూ.200 కోట్లకు పైగా వసూలు చేశాడు ఏపీలోని వైజాగ్‌కు చెందిన ఓ కేటుగాడు. డిజిటల్ క్రిప్టో కరెన్సీ అంటూ బిట్ కాయిన్, సటోషి నకమొటో గ్రూప్‌లలో పెట్టుబడులు పెట్టి రూ.కోట్లలో ఆదాయం సముపార్జించిన కొందర్ని ఉదాహరణగా చూపుతూ...ఆకర్షనీయమైన ఆఫర్లు సైతం ప్రకటించడంతో పలువురు రూ.వేలల్లో చెల్లించి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. చైన్ సిస్టం ద్వారా జరిగే ఈ క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో సభ్యత్వం తీసుకుంటే మార్చి 2023 నాటికి కోటీశ్వరులు కావచ్చని కిభో సంస్థ సూపర్ సీఈవో సూచిస్తున్నాడు. ఏరియాల వారీగా సీఈవోలు, లీడర్స్‌ను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెడుతున్నాడని సమాచారం.
క్రిప్టో కరెన్సీ ప్రమాణాల్లో ఒక్కటీ కిభోకు లేదు...
క్రిప్టో కరెన్సీకి ఉండాల్సిన ప్రమాణాల్లో ఒక్కటి కూడా కిభోకు లేదు. దీనిలో చెల్లించిన డబ్బులకు గ్యారెంటీ లేదు. కంపెనీ అడ్రస్సూ ఎక్కడ వెదికినా కనిపించదు. క్రిప్టో కరెన్సీకి ఉండాల్సిన బ్లాక్ చెయిన్, వైట్ పేపర్, రోడ్ మ్యాప్ వంటి ప్రమాణాలేవీ దీనిలో మచ్చుకైనా కనిపించవు. ఎన్నికాయిన్స్ మైనింగ్ చేయగలమో సూచించాలి. క్రిప్టో కంపెనీకి ఫ్రీమైనింగ్ ఉండాలి. ఈ ఫ్రీమైనింగ్ ద్వారా కమ్యూనిటీ పెంచుకోవాలి. క్రిప్టో కంపెనీ వివరాలు, పరిధి తెలియజేయాలి. కంపెనీ లక్ష్యాలు, స్పష్టీకరణలు వెల్లడించాలి. కానీ ఇవేవీ కిభో విషయంలో కనిపించవు. అస్సలు ఇండియాలో క్రిప్టో కరెన్సీకి అనుమతులే లేవు. ఇటీవల డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ అనుమతించినా...క్రిప్టోకు మాత్రం అనుమతివ్వలేదు. కానీ కిభో మాత్రం ఆ పేరిట వ్యాపారం నిర్వహిస్తుం డటం చర్చనీయాంశమైంది. కిభో వైట్పేజీలో అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఓపెన్ చేస్తే కంపెనీ వివరాలు ఏవీ కనిపించకపోవడం గమనార్హం. క్రిప్టో కరెన్సీ కంపెనీకి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా కిభో వెబ్సైట్లో కనిపించదు.
కిభో ఆఫర్లు...
కిలపర్తి భోవర్దన్ (కిభో) పేరుతో ఆంధ్రాకు చెందిన ఓ వ్యక్తి సూపర్ సీఈవోగా నిర్వహిస్తున్న కిభో క్రిప్టో కరెన్సీ ఆఫర్లు అదిరిపోయేలా ఉన్నాయి. ప్రస్తుతం అమెరికన్ డాలర్ విలువ రూ.82 చొప్పున పలుకుతుంటే కిబో కాయిన్ విలువ రూ.111 కావడం గమనార్హం. రూ.500 చెల్లిస్తే నాలుగు కాయిన్స్ లభిస్తాయి. కంపెనీ ఐడీ వస్తుంది. చైన్సిస్టంలో భాగంగా ఒకరిని చేర్పిస్తే రూ.100 నుంచి రూ.150, అదే మహిళలలైతే రూ.300 లేదా రూ.350 విలువైన కాయిన్స్ వస్తాయి. 66 మందిని చేర్పిస్తే రూ.33వేల మొబైల్ ఫోన్ గిఫ్ట్, 132 మందైతే రూ.66వేల విలువ చేస్తే ఓ బైక్, 1,584 మందిని చేర్పిస్తే మాత్రం ఏకంగా ఓ కారు బహుమతిగా ఇస్తారట. ఇవన్నీ వస్తు రూపేణో, డబ్బుల రూపంలోనో ఇవ్వరు సుమా. ఇవీ కిభో కాయిన్స్ రూపంలో ఇస్తారు. వీటిని అమ్ముకోవాలి. ఒకవేళ అమ్ముడుపోకపోతే చేతి నుంచి ఈఐఎంలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతేకాదు కిభో నాన్స్టేకబుల్ (నిల్వ ఉండని కాయిన్స్), పోన్‌పే తరహాలో కిభో పే, కిభో మార్ట్, కిభో పెట్రోల్ స్టేషన్స్, కిభో జ్యూయలరీ...ఇలా అనేక రకాల కిప్ట్రో ఎరలు వేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. జరిగిన మోసాన్ని చెప్పుకుంటే పరువు పోతుందని ఎవరూ ముందుకు రావడం లేదు.
'కిభో' మాయలో విలవిల...
కిభో కంపెనీ మాయలో పడి ఇలా అనేక మంది చైన్సిస్టంలో భాగంగా వందలాది మందిని సభ్యులుగా చేర్చారు. రూ.500తో కోటీశ్వరులం అవుతామనే ఆశతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను టార్గెట్‌గా చేసుకుని ఈ మాయకు తెరలేపారు. ఇంతటితో ఆగకుండా లోన్ల పేరుతోనూ దగాకు పాల్పడటంతో బాధితులు సీఈవోలు, లీడర్లను నిలదీస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ముక్కలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, కారేపల్లి, ఆళ్లపల్లి తదితర ప్రాంతాల్లోని వేలాది మంది సభ్యులుగా చేరినట్టు సమాచారం అందుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 వేల మందికి పైగా సభ్యత్వాలు తీసుకుని రూ.25లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. దీనిలో రూ.500, వెయ్యి రూపాయలు చెల్లించిన పలువురు పోతేపోనీ అన్నట్టుగా ఉండగా...రూ.వేలల్లో చెల్లించిన వారు మాత్రం కంపెనీ చేసిన మోసంతో తలలు పట్టుకుంటున్నారు. తమను సభ్యులుగా చేర్పించిన వారిపై మండిపడుతున్నారు.
దురాశతో మోసపోవద్దు...
ఆర్బీఐ అనుమతిలేని క్రిప్టో కరెన్సీపై వ్యామోహంతో డబ్బులు చెల్లించి మోసపోవద్దు. ఇలాంటి మోసకారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ కరెన్సీ సంస్థల సమాచారం ఇవ్వాలి. క్రిప్టో కరెన్సీపై పోలీసుస్టేషన్ల వారీగా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిభో పేరుతో జరుగుతున్న మోసంపై దృష్టి సారిస్తాం.
- డాక్టర్ వినీత్, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం