Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాపార్కు వద్ద డీఎస్సీ-2008 అభ్యర్థుల దీక్ష
నవతెలంగాణ- అడిక్‌మెట్
డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద డీఎస్సీ-2008 బీఈడీ అభ్యర్థులు 'కేసీఆర్ వేడుకోలు' నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నరసింహారావు, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి, ఎస్టీయూ సెక్రటరీలు కరుణాకర్ రెడ్డి, పోల్ రెడ్డి, ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు ఇందిరాశోభన్, డీఎస్సీ- 2008 మెరిట్ అభ్యర్థుల అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
డీఎస్సీ-2008లో ఎంపికైన అభ్యర్థులు అప్పటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వారికి ఉద్యోగాలు ఇస్తామని 2016 వరంగల్ మహాసభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఫైల్ కూడా మొదలుపెట్టారని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ ఫైల్‌కు మోక్షం రాలేదన్నారు. ఏపీలో సీఎం జగన్ అక్కడి 2008 -డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో మాత్రం అభ్యర్థులకు ఎదురుచూపులే మిగిలాయన్నారు. నష్టపోయిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆనాడు హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అప్పటి నుంచి అభ్యర్థులు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రికి లేఖలు కూడా రాశామని చెప్పారు. సీఎంకు ఈ విషయం చేరిన రోజే సమస్య పరిష్కారం అవుతుందని.. తమను సీఎం వద్దకు తీసుకెళ్లాలని, లేకపోతే తమ సమస్యనైనా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. ఈ దీక్షలో అభ్యర్థులు తమ పిల్లలతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. డీఎస్సీ- 2008 బీఈడీ మెరిట్ క్యాండిడేట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సింగారి సంగమేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్, సతీష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ చావ్లా, జయప్రకాష్, రమేష్ విజయలక్ష్మి, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.