Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధలెట్ట చెప్పాలి?: కేంద్రమంత్రి నిర్మలపై నేతల ఆగ్రహం
- 12 డిమాండ్లలో ఒక్కదాన్నీ పరిష్కరించే చిత్తశుద్ధిలేదు: ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నిరసనలో కార్మిక సంఘాల నేతలు
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన మహిళా నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి బడ్జెట్ సమావేశాల ముందూ కార్మిక సంఘాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశంపెట్టి అభ్యంతరాలను స్వీకరించడం, సలహాలను పరిగణనలోకి తీసుకోవడం సాంప్రదాయకంగా వస్తున్నదనీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి మాత్రం మొక్కుబడిగా ఆన్లైన్ సమావేశం పెట్టి మూడే నిమిషాలు మాట్లాడాలంటూ షరతులు పెట్టడం దారుణమని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. ఆ కొద్ది సమయంలో కార్మికుల సమస్యలను, బాధలను కేంద్రం దృష్టికి ఏవిధంగా తీసుకురాగలుగుతామా? అని నిలదీశారు. కార్పొరేట్లకు రాయితీల మీద రాయితీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం గత సార్వత్రిక సమ్మెల సందర్భంగా కార్మిక సంఘాలు ఐక్యంగా లేవనెత్తిన 12 డిమాండ్లలో ఒక్కదాన్నైనా పరిష్కరించిందా? అని ప్రశ్నించారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 'కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి... మోడీ సర్కారు డౌన్‌డౌన్...లేబర్ కోడ్లను రద్దు చేయాలి..పాత చట్టాలను పునరుద్ధరించాలి... కార్పొరేట్ శక్తులకు మోడీ సర్కారు దాసోహం సిగ్గుసిగ్గు...' అంటూ నినాదాలు చేశారు. కార్మిక సంఘాల మహిళా నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజు, అధ్యక్షులు ఎమ్డీ యూసుఫ్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్, ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబురావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు స్వామి, తదితరులు మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్మిక సంఘాలతో మాట్లాడటానికి షరతులు పెట్టడం దారుణమ న్నారు. భౌతికంగా సమావేశం పెట్టకుండా ఆన్లైన్లో నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. సమావేశానికి ఒక్కరోజు ముందు నోటీసు పంపి మూడు నిమిషాలే మాట్లాడాలని చెప్పటం అన్యాయమన్నారు. దీనిని బట్టే కార్మికుల సమస్యలను వినటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని అర్ధమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద, మధ్యతరగతి వర్గాలపై మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్, పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో పనిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ఒక పథకం ప్రకారం ప్రయివేటీకరణ చేసుకుంటూ పోతున్న తీరును వివరించారు.
ప్రజల సొమ్ముకు భద్రత కల్పిస్తూ సేవలందిస్తున్న బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రయివేటుపరం చేసేందుకు మోడీ సర్కారు అడుగులు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు సాగిస్తామని ప్రకటించారు. అసంఘటితరంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ.రమ, జె.వెంకటేశ్, భూపాల్, ఎం.వెంకటేశ్, మధు, ఉపాధ్యక్షులు పి.జయలక్ష్మి, ఆర్.కోటంరాజు, జె.మల్లిఖార్జున్, కళ్యాణం వెంకటేశ్వర్లు, పద్మశ్రీ, మంద నర్సింహారావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ప్రేంపావని, కార్యదర్శి ఓమయ్య, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరు కుమార్ యాదవ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు అరుణ, సీఐటీయూ రాష్ట్ర నాయకులు సోమన్న, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.