Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య పంటలతో తగ్గిన విస్తీర్ణం
- ఈ ఏడాది వానలకు దెబ్బతిన్న పంట
- తగ్గిపోయిన ఉత్పత్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మన ఆహారంలో ముఖ్య భాగమైన జొన్నలకు కరువొచ్చింది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకునే వారు ఎక్కువగా జొన్నలు ఉపయోగిస్తున్నారు. ప్రతి మనిషి సమతుల్య ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలంటే, కచ్చితంగా జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, కొర్రలు వంటి చిరు ధాన్యాలు ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఇవి తీసుకోవాలని సలహానిస్తున్నారు. నయం కాని రోగ నియంత్రణలో ఉండాలంటే చిరుధాన్యాల పాత్ర కీలకమంటూ డాక్టర్లు చెబుతున్నారు.పేదల ఆహార పంటగా పేరొందిన జొన్న నేడు అన్ని వర్గాల ప్రజలు వినియోగిస్తున్నారు. మారుతున్న జీవన శైలిలో భాగంగా సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ మహానగరంలో జొన్న రొట్టెలు వ్యాపారంగా మారాయి. గల్లీ గల్లీలో రొట్టెలు తయారు చేసి అమ్ముకుని ఉపాధి ఉపొందుతున్నారు. అయితే రాష్ట్రంలో జొన్న పంట సాగు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గ్రామాల్లోనూ జొన్నలు దొరకపోవడంతో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎకర, రెండు ఎకరాలు ఉన్న రైతులు సైతం ఇంటి అవసరాల కోసం జొన్న పంటను సాగు చేస్తారు. వర్షాలకు సాగయ్యే ఈ పంటను జూన్ మాసంలో వేస్తారు. ఐదునెలల్లో పంట చేతికొచ్చే ఈ పంట సాగు క్రమంగా తగ్గిపోతున్నది.
ఆ రెండు పంటలకే ప్రాధాన్యం
అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో 1.21 కోట్ల సాగు భూమి మాత్రమే ఉన్నది. ఈ కాలంలో దాదాపు 67.8 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ కమిషనర్ పేర్కొన్నారు. అందులో వరి పంట సాగు దాదాపు 54 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. పత్తి 60. 53 లక్షల ఎకరాల్లో (2020-21) సాగవుతుందని అంచనా వేసింది. దీని ప్రకారం ఆ రెండు పంటలకే 1.15 లక్షల ఎకరాలను అంచనా వేసింది. మిగతా పంటలు పోను జొన్న పంటకు మాత్రం లక్షా 20వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. దీంతో రైతులు వాణిజ్య పంటల సాగు వైపుకు మారేలా వ్యవసాయ శాఖ పదే పదే ప్రకటనలు చేసింది. దీంతో రైతుల వరి, పత్తి, మక్క జొన్న వంటి పంటలకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతోపాటు వాటికి మద్దతు ధరలు ఉన్నాయి. అయితే మిగతా పంటలకు ఆయా ధరలు లేకపోవడంతో వాటిపైపు మొగ్గు చూపడం లేదు. ఆహర, పప్పుల ధాన్యాల సాగు క్రమంగా తగ్గిపోతున్నది.
అధిక వర్షాలకు పంట నష్టం
ఈఏడాది వానాకాలం ప్రారంభంలో అధిక వర్షాలు కురిశాయి. అక్కడక్కడ వేసిన జొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నది. తక్కువ విస్తీర్ణంలో సాగైన పంట సైతం చేతికందలేదు. దీంతో జొన్న దిగుబడి పావు వంతుకు పడిపోయింది. ఈఏడాది మాత్రమే కాకుండా ప్రతీయేడాది జొన్న దిగుబడి క్రమంగా తగ్గుతున్నది. 2017లో 72 శాతం ఉండగా, 2022లో 38 శాతం ఉత్పత్తి మాత్రమే వచ్చింది. సాగు విస్తీర్ణం కూడా పెద్దగా పెరగడం లేదు. దీని కారణంగా జొన్నల కొరత ఏర్పడింది. పచ్చ జొన్న స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి తెల్లజొన్న దిగుమతి అవుతున్నది. వాటికి పసుపు రంగు పూసి అమ్ముతున్నారనీ, ఆ అనుభవం తమకు ఎదురైందని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన అమృత ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో చాలా మంది రైతులు జొన్నలు పండకపోవడంతో కొనుగోలు చేస్తున్నారు.
కిలో జొన్నల ధర రూ 60
జొన్నలకు మార్కెట్లో కిలో ధర రూ 60 పలుకుతున్నది. కొన్ని చోట్ల అంతకు మించిన ధరకు అమ్ముతున్నారు. పంట దిగుబడి తగ్గిపోవడం, వాణిజ్య పంటలు పెరిగిపోవడంతో జొన్న పంట దిగుబడి బాగా పడిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అదే మోతాదులో ధర కూడా పెరుగుతున్నది. రానున్న ఐదారు నెలల్లో జొన్న దొరక్కపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు రానున్నాయి. దీంతో సూపర్ మార్కెట్లకే జొన్నలు పరిమితం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో జొన్న సాగు పెంచాల్సిన అవసరమున్నది.