Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉధృత పోరాటాలకు సన్నద్ధం
- విలేకర్ల సమావేశంలో ఏఐటీయూసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం శ్రామిక వర్గంపై ఉక్కు పాదం మోపుతున్నదనీ, ఈ నేపథ్యంలో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉధృత పోరాటాలకు సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ యూసఫ్,ఎస్ బాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల యాదగిరి గుట్టలో నిర్వహించిన ఏఐటీయూసీ రాష్ట్ర మూడో మహాసభలో కార్మికుల సంక్షేమం, హక్కులు, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై 35 తీర్మానాలు చేసినట్టు తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను విధ్వంసం చేస్తూ పరిశ్రమల అధిపతులకు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తిప్పికొట్టాలన్నారు. కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను పునరుద్దరించాలనీ, రక్షణ రంగాన్ని ప్రయివేటీకరణను ఆపాలని కోరారు. కార్మికులకు కనీస పెన్షన్ రూ.10వేలు చెల్లించాలని, తిరోగమన బ్యాంకింగ్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ 21 మందిని ఆఫీసు బేరర్లుగా, 39 మందిని వర్కింగ్ కమిటీ సభ్యులుగా, 131 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నదని తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహ్మా, జాతీయ నాయకులు రత్నాకర్‌రావు, ఉపాధ్యక్షులు ప్రేంపావని తదితరులు పాల్గొన్నారు.