Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్కాలర్షిప్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంరించుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్కాలర్షిప్ల రద్దు వల్ల పేద విద్యార్థులు చదువులకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకిచ్చే స్కాలర్షిప్లను ఇవ్వబోమంటూ కేంద్రం ప్రకటించడం సరైందికాదని విమర్శించారు. పేద విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు వారి చదువుకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్యను సాకుగా చూపి కేవలం తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకే ఈ స్కాలర్షిప్లను పరిమితం చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. దీనివల్ల ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,ఈబీసీ విద్యార్థులు చదువులకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించాలంటూనే ఇలాంటి ప్రమాదకర నిబంధనలు తేవడంతో ఆ లక్ష్యం నెరవేరబోదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి, ప్రజాసంఘాలను కలుపుకుని ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
పేదలకు విద్యను దూరం చేసే కుట్ర : ఏఐఎస్ఎఫ్
స్కాలర్షిప్ల రద్దుతో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇవ్వబోమంటూ బీజేపి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభిన్నదని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.