Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి ఆధారంగా కార్యాచరణ
- ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రతి మండలానికి ఐదుగురు చొప్పున గ్రామాల్లోకి వెళ్లి ధరణి సమస్యలపై సర్వేలు చేయాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలపై ఆయా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించేదనీ, అక్కడ సమస్యలు పరిష్కారమయ్యేవని చెప్పారు. వ్యూహకర్త సునీల్ కనుగోలు కొంత డేటా అందజేశారని తెలిపారు. ధరణి లోటుపాట్లపై శుక్రవారం హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఈరవత్రి అనిల్, హర్కర వేణుగోపాల్, ప్రీతం, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జగ్గారెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈనెల 11న ప్రతి మండలంలో ఐదుగురు చొప్పున మూడువేల మందికి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు.
షర్మిలది ఓవరాక్షన్
తెలంగాణలో సమస్యలపై ఎవరూ ప్రశ్నించనట్టు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. 'ఏపీలో సీఎం మీ అన్నే కదా అక్కడ సమస్యలు లేవా? ఏపీలో సమస్యలపై షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? త్వరలోనే షర్మిల ఆర్థిక వ్యవహారాలన్నీ బయటపెడతా. తెలంగాణకు షర్మిల కోడలే తప్ప కూతురు కాదు' అని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఇద్దరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మాది తోడికోడళ్ళ పంచాయితీ
రేవంత్ - జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
ఇంకా పదేళ్లు ఐనా.. రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మాది తోడికోడళ్ళ పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం.. మళ్లీ కలిసిపోతాం' అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.
రేవంత్‌తో పృధ్వీరాజ్ చవాన్ భేటీ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో మర్యాపూర్వకంగా కలిశారు. దాదాపు గంటపాటు భేటీ అయిన చవాన్.. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భారత్ జోడో యాత్ర అంశాలపై చర్చించారు.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో టీపీసీసీ బందం భేటీ
తెలంగాణ భూరికార్డుల సవరణలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అజరు టిర్కిని కోరారు. శుక్రవారం టీపీసీసీ బృందం వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల సవరణ పేరుతో జరిగిన అవకతవకల విషయంలో సమగ్ర విచారణ జరపాలని కోరారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు ఉన్నారు.