Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు టీఎస్పీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులను వెంటనే మంజూరు చేయాలని టీఎస్పీటీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావుకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, పిట్ల రాజయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ పోస్టులను మంజూరు చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల దస్త్రాన్ని ఆమోదించి జీవో జారీ చేయాలని కోరారు. 317 జీవో ద్వారా ఉత్పన్నమైన సమస్యల పరిష్కరించాలని తెలిపారు. సూపర్ న్యూమరరీ పోస్టులను మంజూరు చేయాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 13 జిల్లాల స్పౌజ్ బదిలీలను పూర్తి చేయాలని తెలిపారు. పీఆర్సీ సిఫారసుల ప్రకారం పెండింగ్ జీవోలను జారీ చేయాలని పేర్కొన్నారు. ఈ-కుబేర్ పెండింగ్ బిల్లులను ఆమోదించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వివరించారు. సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీటీఏ ఆర్థిక కార్యదర్శి శ్యాంసుందర్, నాయకులు సత్యం, ఎం శ్రీనివాస్, రమేష్, సురేష్ కుమార్, కృష్ణారెడ్డి, బత్తిని స్వప్న, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.