Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యానికి రూ.16 కోట్లు
- ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ చెంగిచెర్లకు చెందిన మూడు నెలల బాలుడు శివమాన్విత్ అరుదైన స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ అనే వ్యాధితో బాధ పడుతున్నాడు. ప్రయివేటు కంపెనీలో చిరుద్యోగి కుమారస్వామి, భవాని దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఈ బాలుడు పుట్టిన తర్వాత నెల రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్నాడు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో అతడిని నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిశీలించి సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికెళ్లిన తర్వాత అతడికి జన్యుపరమైన పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపారు. బాలుని రక్తనమూనాలను సీసీఎంబీకి పంపించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు శివమాన్విత్ను హైదరాబాద్లోని ప్రయివేటు చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆ బాలునికి అరుదైన వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. కాళ్లు, చేతులు సరిగ్గా కదిలించలేని స్థితిలో ఉన్న ఆ బాలుడి వ్యాధిని నయం చేయడానికి వాడాల్సిన మందు ఖరీదు రూ.10 కోట్లు కాగా, ఆ మందును దిగుమతి చేసుకునేందుకు రూ.ఆరు కోట్లతో కలిపి రూ.16 కోట్లు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. అది కూడా బాలునికి రెండేండ్లు వచ్చే లోపే చేయాలని వైద్యులు సూచించినట్టు కుమారస్వామి తెలిపారు. రోజులు దగ్గర పడుతుండటంతో ఆందోళన పెరుగుతున్నదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతలు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సహాయం చేయాలనుకునే వారు కుమారస్వామిని 63014 96492 నెంబర్లో సంప్రదించవచ్చు.