Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/నాగోల్
హైదరాబాద్ నాగోల్‌లోని ఓ బంగారం షాపులో గురువారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు చోరీ చేసిన వాహనాలపై వచ్చి ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రెండు వాహనాలకు నెంబర్లు తొలిగించిన నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. ఇదిలావుండగా, కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు బాధితులు కల్యాణ్ చౌదరి, సుఖ్ దేవ్‌ను నాగోల్‌లోని సుప్రజ ఆస్పత్రిలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ శుక్రవారం పరామర్శించారు. ఇద్దరికి ఆపరేషన్ చేసినట్టు సీపీకి వైద్యులు తెలిపారు. కాల్పుల ఘటన గురించి భాదితులను సీపీ అడిగి తెలుసుకున్నారు. ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న కల్యాణ్ చౌదరి స్నేహపురి కాలనీ రోడ్‌నెంబర్-6లో మహదేవ్ జువెల్లరీ దుకాణం నడిపిస్తున్నారు.
అనంతరం మీడియాతో సీపీ మాట్లాడారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో నగల షాపులో కాల్పులు జరిగాయన్నారు. బంగారం బ్యాగ్‌తో పరారయ్యేందుకు దుండగులు యత్నించగా వారిని షాపు యజమాని, బంగారం సప్లయర్ అడ్డుకున్నారని చెప్పారు. దాంతో ఇద్దరిపై నిందితులు 4 రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. వెంటనే తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని.. నిందితులను పట్టుకునేందుకు ఎస్వోటీ, స్పెషల్ బ్రాంచ్‌తోపాటు 15 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని స్పష్టం చేశారు. ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు తెలుస్తున్నదన్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని సీపీ తెలిపారు. 2018లో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో దోపిడీ జరిగిందని గుర్తు చేశారు. ఆ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. ఆ ముఠాకు చెందిన వారెవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో ఆరా తీస్తున్నామని చెప్పారు. రెండు కిలోల బంగారం, రూ.1.70 లక్షలతో దుండగులు పరారైనట్టు తెలుస్తోం దన్నారు. దోపిడీకి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడినట్టు చెప్పారు. సంఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించామని, డాగ్‌స్వ్కాడ్ ద్వారా తనిఖీలు చేశామన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తులు తెలిసిన వారే అనే కోణంలో సైతం ఆరా తీస్తున్నామన్నారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.