Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్వల పనులు త్వరగా పూర్తి చేయాలి
- ఇరిగేషన్ పనుల పురోగతిపై : మంత్రి హరీశ్‌రావు సమీక్ష
నవతెలంగాణ-సిద్దిపేట
ప్రతి ఊరికి, ప్రతి చెరువుకూ కాల్వలు, మైనర్ కాల్వల ద్వారా నీళ్లు చేరవేయడమే లక్ష్యంగా పని చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. మైనర్ ఇరిగేషన్ కాల్వ భూసేకరణ తొందరగా చేపట్టి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మల్లన్న, రంగనాయక సాగర్ జలాశయం ద్వారా కాల్వలు, మైనర్ కాల్వల పనుల పురోభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ, ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఇంజినీరింగ్ అధి కారులతో మంత్రి సమీక్షిం చారు. మైనర్ ఇరిగేషన్ పనులకు కావాల్సిన వాటిలో చిన్నకోడూర్ మండలంలో కస్తూ రిపల్లి చెక్ డ్యాం, మల్లారం చెక్ డ్యాం, నారాయణ రావుపేట మండల కేంద్రమైన పెద్ద చెరువు కాజ్ వే, గోపులాపూర్ చెక్ డ్యాం, ఇబ్రహీంనగర్ గ్రామ మిట్ట మల్లయ్య చెరువు రిస్టోరేషన్ పనులు, గుర్రాలగొంది చెరువు, రాజగోపాల్ పేట, నంగునూరు చెరువులకు కాజ్వే నిర్మాణ పనులకు వెంటనే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ ఈఈ సాయిబాబాను ఆదేశించారు. మల్లన్నసాగర్ 1ఆర్ కాలువ ఆయకట్టు 21000 ఎకరాల పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. మల్లన్నసాగర్ 1ఆర్ పరిధి గ్రామాల మీదుగా వెళ్లే కాల్వ భూసేకరణ, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మల్లన్న సాగర్ 3ఆర్, 4ఆర్ కాల్వపై చర్చించారు. పుల్లూర్ గ్రామ పడమట చెరువు, వెంకటయ్య చెరువు, నాగుల కుంటకు నీళ్లు నింపితే ఆ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. రంగనాయకసాగర్ ఎల్ఎంసి-ఆర్ 8 కాలువ వాగు క్రాసింగ్ బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని, ఏజన్సీ, ఇరిగేషన్ అధికారిని ఆదేశించారు. ఆర్ 8 కాలువ ద్వారా మాటిండ్ల గ్రామం వరకు నీళ్లు ఇవ్వాలని సూచించారు. రంగనాయకసాగర్ ఎల్ఎంసి-ఆర్ 3- ఆర్ ఎం 2-ఎల్ఎస్ఎం5 కాలువ పనులు, భూసేకరణ త్వరగా పూర్తి చేసి మైలారం, కమ్మర్లపల్లి, చౌడారం, అల్లీపూర్‌కు వెంటనే నీళ్లు ఇవ్వాలని, అలాగే నంగునూర్ మండలం ఘనపూర్, అక్కేనపల్లి, గట్లమల్యాల గ్రామాలకు వాగు మీద జరుగుతున్న లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు ఇవ్వాల,ని అధికారులకు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ అడ్డంకులను అధిగ మించాలని దిశానిర్దేశం చేశారు. నాగరాజుపల్లి ద్వారా వాగులోకి ఎల్ డి10 కాలువ ద్వారా వాగులోకి నీళ్లు ఇవ్వాలని, నంగునూర్ మండలంలో కాలువ ఎల్ డి6-ఎల్ ఎం 1 పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
మత్స్య సహకారం సంఘాలు ఏర్పాటు చేయాలి
నీటి వనరులపై నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చిన దరిమిలా మత్స్యకారులకు కొత్త సొసైటీల ఏర్పాటు కసరత్తు త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా మత్స్యకార శాఖ అధికారిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కొత్త సభ్యులకు ప్రభుత్వ పథకాలతో పాటు సబ్సిడీ రుణాలు, బీమా సౌకర్యం లభిస్తాయన్నారు. సంఘాల్లో చేరే వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికే మెంబర్షిప్ ఇస్తారన్నారు. సమీక్ష సమావేశంలో సుడా చైర్మెన్ రవీందర్ రెడ్డి, చిన్నకోడూర్ ఏంపీపీ కూర మాణిక్ రెడ్డి, నాయకులు చందర్రావు, ఆర్డీఓ ఆనంతరెడ్డి, ఇరిగేషన్ ఈఈ సాయి బాబా, డీఈ, ఏఈఈ ఖాజా, ఏఈఈ అమరజీవి తదితరులు పాల్గొన్నారు.