Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ రెండో రోజు శుక్రవారం కూడా చంచల్‌గూడ జైలు నుంచి బయటకు రాలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజి స్వామి, నందకుమార్‌లకు గురువారం షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, కోర్టు ఉదయయే బెయిల్ మంజూరు చేసినప్పటికీ సాయంత్రం వరకు కూడా అందుకు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు సమర్పించకపోవటంతో ముగ్గురు నిందితులు విడుదల కాలేదు. రెండో రోజైన శుక్రవారం సాయంత్రం వరకు కూడా బెయిల్ పత్రాలు అందకపోవటంతో ఆ ముగ్గురిని అధికారులు విడుదల చేయలేదని తెలిసింది. అయితే, మరోపక్క, ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలన చొప్పును ఒక్కో నిందితుడికి ఇద్దరు షఉరిటీలు ఇవ్వాలని కోర్టు నిబంధన విధించగా ఆ వెసులుబాటు కాకపోవటంతోనే ముగ్గురు నింది తులు విడుదల కాలేకపోయారని మరో సమాచారం. ఇదిలా ఉంటే ఈ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు రామచంద్ర భారతి, నందకుమార్‌లను జైలు నుంచి విడుదల కాగానే అరెస్టు చేయటానికి బంజారాహిల్స్ పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. రెండేసి పాస్‌పోర్టులు, ఆధార్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్‌కార్డులను రామచంద్ర భారతి కలిగి ఉండటంపై రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసులను నమోదు చేసి ఉన్నారు. మరోవైపు, బంజారాహిల్స్‌లో మోసపూరితంగా ఒక భూమిని మరొకరికి లీజుకిచ్చారనే ఆరోపణలపై నందకుమార్ పైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులైన కారణంగా రామచంద్ర భారతి, నందకుమార్‌లను అరెస్టు చేయటానికి బంజారాహిల్స్ పోలీసులు రంగం సిద్ధం చేసి ఉంచారు. కాగా, బంజారాహిల్స్‌కు కేసుకు సంబంధించి ఈ ఇద్దరు నిందితులకు ముందస్తు బెయిల్ తీసుకోవటానికి మరోపక్క వారు లాయర్లు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే బెయిల్‌పై ఉద్దేశ పూర్వకంగా నిందితులు విడుదల కావటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ శనివారం ఈ ముగ్గురు నిందితులు బెయిల్‌పై విడుదైల వస్తారా? లేదా? అనే మీమాంస నెలకొన్నది.