Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం పీఆర్టీయూ తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత శాసనమండలి సభ్యులు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ అభిప్రాయం మేరకు జనార్ధన్‌రెడ్డి పోటీ చేస్తారని వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు బదిలీల్లో ప్రాధాన్యతను కల్పించాలనీ, సొంత జిల్లాకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని నివారించాలనీ, అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. నిషేధం విధించిన 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలని చెప్పారు. ఎనిమిదేండ్లుగా నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతులను కొత్త జిల్లాల వారీగా చేపట్టేందుకు షెడ్యూల్ ప్రకటించాలని అన్నారు. కె జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసమే పనిచేశానని చెప్పారు. భవిష్యత్తులోనూ ఉపాధ్యాయులకు అండగా ఉంటానని అన్నారు. ఈర్ష్య, అభద్రతాభావంతోనే తనకు పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వలేదన్నారు. ఈ నియోజకవర్గంలోని తొమ్మిది జిల్లాల అధ్యక్ష, కార్యదర్శు లతోపాటు మండలాలు సైతం తనకు అనుకూలంగా తీర్మానాలు చేసి రాష్ట్ర కమిటీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆ సంఘం బైలా ప్రకారం 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయంతో తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. అయితే నల్లగొండ, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఆ పద్ధతిని ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. ఆయా నియోజకవర్గాల్లోని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సమంజసమని అడిగారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ గౌరవాధ్యక్షులు పర్వతి సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రావు, వ్యవస్థాపక అధ్యక్షులు ముకుందరెడ్డి, పత్రిక సంపాదకులు పి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణా కమిటీ అధ్యక్షులు అడప రామారావు తదితరులు పాల్గొన్నారు.