Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా శిశు సంక్షేమం నుంచి విభజన
- ఫలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషి
- సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి
- మా పోరాటాల ఫలితంగానే : ఎన్పీఆర్డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకు స్త్రీ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న వికలాంగుల, వయోజన సంక్షేమ శాఖ ఇకపై స్వయం ప్రతిపత్తితో పని చేయనున్నది. స్త్రీ సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖను వేరు చేయడం ద్వారా వారి సంక్షేమానికి సత్వర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలగనున్నది. ఇందుకోసం రాష్ట్ర దళితాభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన కృషి ఫలించింది. కేసీఆర్ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు మంత్రి కొప్పుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖగా మార్చేందుకు సీఎం చొరవతో ప్రభుత్వం జీవో నెం. 33, 34 జారీ చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమర్థవంతమైన సేవలను అందించడానికి జిల్లా స్థాయిలో స్వతంత్ర శాఖకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.వికలాంగులు, వయోజనులు, ట్రాన్స్జెండర్ల కోసం జిల్లాల్లో తదనుగుణంగా అధికారులను తిరిగి నియమించనున్నట్టు తెలిపారు. అందుబాటులో ఉన్న క్యాడర్ స్ట్రెంత్‌ను పున్ణపంపిణీ చేయడానికి ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు జారీ చేయనుంది. మహిళా, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమ శాఖల మధ్య డిపార్ట్మెంట్, పని విభజన చేయనున్నారు.
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆశాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన నాటి నుంచే ఎన్పీఆర్డీతోపాటు పలు సంస్థలు అనేక పోరాటాలు నిర్వహించాయని తెలిపారు. ప్రభుత్వం వికలాంగుల హక్కుల పోరాటాలను గౌరవించి ఉత్తర్వులు జారీచేయటం హర్షనీయమన్నారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్, వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్ కె వాసుదేవ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ శాఖ సాధన కోసం వికలాంగులు చేసిన ఉద్యమాల స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.