Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ధర్నాలు
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, మూడు ఐఫ్టీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా మట్టెవాడ ఖమ్మం రోడ్డులోని ఇసుక అడ్డా వద్ద ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఖిలా వరంగల్ మండలం ఆర్టీవో ఆఫీస్ కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల పాత బస్టాండ్ కృష్ణవేణి చౌక్ వద్ద నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రెబ్బెన మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నిర్మల్‌లో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి కట్ల రాజన్న కార్మికుల హక్కులపై దాడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ పాల్గొన్నారు. బాచుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. షాపూర్‌నగర్‌లో రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు ఏఐటీయూసీ, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన తీశారు. మల్కాజిగిరి చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఎల్బీనగర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.