Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వంతో అమరరాజా గ్రూప్ ఒప్పందం
- పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : తిరుపతి ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న ప్రముఖ బ్యాటరీ ఉత్పత్తుల కంపెనీ అమర రాజా గ్రూపు తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ప్రకటించింది. రాష్ట్రంలో లిథియం ఐయాన్ గిగా ఫ్యాక్టరీని నెలకొల్పడా నికి ముందుకు వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈ విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి వీలుగా శుక్రవారం హైదరాబాద్‌లో అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు 4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ వెల్లడించింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, అమరరాజా గ్రూప్ చైర్మెన్, ఎండీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అమరరాజా గ్రూపు నూతన యూనిట్ రాష్ట్రానికి వచ్చిన మరో భారీ పెట్టుబడి అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు లీథియం ఐయాన్ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటులో పెట్టుబడులకు ముందుకు వచ్చిన అమరరాజాకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. దాదాపు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమన్నారు. పెట్టుబడులకు వీలుగా పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు.
గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఈవీ బ్యాటరీలకు పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోవడానికి నూతన ప్లాంట్ దోహదం చేయనుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని ఆలోచించాలని అమరరాజా సంస్థను రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మా సంస్థ పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. తెలంగాణలో ఈవీ వాహనాల రంగం పుంజుకుంటోందన్నారు. ఈ రంగం పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపామన్నారు. ఇక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని గల్లా జయదేవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, అమర రాజా గ్రూపు న్యూ ఎనర్జీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాధిత్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.