Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వసతి గృహం ముందు విద్యార్థినుల ఆందోళన
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో నిరసన..
నవతెలంగాణ-పర్వతగిరి
పురుగుల అన్నం తినలేకపోతున్నామంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహం ఎదుట శుక్రవారం 60 మంది విద్యార్థినులు బైటాయించారు. డీఈవో రావాలి.. మా దుస్థితి చూడాలి.. పురుగుల అన్నం తినలేక కడుపు మాడ్చుకుంటున్నామని రోదించారు. వారం రోజుల నుంచి పచ్చిపులుసు రవ్వతో తినలేక చస్తున్నామని ఆవేదన వెలుబుచ్చారు. మెనూ ప్రకారం వంటలు చేయడం లేదన్నారు. విషయాన్ని స్థానిక కస్తూర్భా గాంధీ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిశీలించి సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేసినట్టు వెల్లడించారు. ఎస్ఓ వచ్చినందున ఆ ఒక్కరోజు మాత్రమే నాణ్యమైన భోజనం పెట్టారని, ఆ తర్వాత మళ్లీ పాత పద్ధతే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు భోజనం చేయబోమని, హాస్టల్ వార్డెన్‌తోపాటు వంట సిబ్బందిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే టీసీలు ఇస్తే హాస్టల్ వదిలి ఇంటికి వెళ్లి పోతామన్నారు. మంచినీరు కూడా లేక నానా ఇబ్బందులకు గురవుతున్నామని, బోరింగ్ నుంచి క్యాన్లలో నీళ్లు తెచ్చుకొని కాలం గడుపుతున్నట్టు చెప్పారు. రాత్రి సమయంలో సరైన లైటింగ్ లేక పాములు, తేళ్లు వస్తున్నాయన్నారు. వార్డెన్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పురుగుల అన్నం తినలేకపోతున్నామని వార్డెన్‌కు చెబితే.. ''మీ కడుపులో లేవా.. మీ మెదల్లో పురుగులు లేవా'' అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు.