Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాట్లు ఆలస్యంగా వేసిన పొలాల్లో తాలు గింజలు
- కాండం బలపడక ఎదగని వరి పైరు
- కాండం తొలిచి.. చి'వరి'కి మిగిలింది నష్టమే..
- పెట్టుబడులూ మిగిలే పరిస్థితి లేక పైరును కోయని వైనం
- కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోనే అధిక ప్రభావం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వర్షాభావ పరిస్థితులతోనో.. సాగు నీరు అందకనో.. భూగర్భజలాలు అందుబాటులో లేకనో సాధారణంగా వరి పొలాలు ఎదగక వరిగింజలు తాలుగా మారుతాయి. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. వానాకాలం ప్రారంభంలో జూన్, జులైలో భారీ వర్షాల కారణంగా ఆలస్యంగా నాట్లు వేసిన పొలాల్లో సగం మేర కాండం తొలిచి వరి కంకులు గట్టిపడక తాలు గింజలే మిగిలాయి. ఈ పరిస్థితి కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోనే అధికంగా ఉంది. సిరిసిల్ల జిల్లాలోనే సుమారు 50వేల ఎకరాల్లో పంట కోయకుండా వదిలేశారు. ఈ వానాకాలం సీజన్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడం, పగటి ఉష్ణోగ్రతలూ అధికంగా ఉండటం కారణంగా ఆగస్టులో ఆలస్యంగా నాట్లు వేశారు. ఆ పైరు సరిగ్గా పొట్టదశకు వచ్చిన అక్టోబర్ మాసంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాండం బలహీనపడి మొగి పురుగు తగులుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 11లక్షల ఎకరాల్లో వరి సాగైతే సుమారు లక్షన్నర ఎకరాల్లో పంట కోయకుండా వదిలేసినట్టు రైతువర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సేకరిస్తున్న వానాకాలం వరిధాన్యం కూడా నత్తనడకనే సాగుతోంది. శనివారం నాటికి కరీంనగర్ జిల్లాలో 353 కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభించిన 341 సెంటర్ల ద్వారా 35వేల 69 మంది రైతుల నుంచి 2లక్షల 15వేల 31 మెట్రిక్టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ జిల్లా మొత్తం ధాన్యం సేకరణ లక్ష్యం 4.5లక్షల మెట్రిక్ టన్నులు కాగా, అందులో సగం మాత్రమే సేకరించడం గమనార్హం. ప్రస్తుతం 57 కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో మూసేశారు.
జగిత్యాల జిల్లాలో పరిశీలిస్తే 427 కొనుగోలు కేంద్రాలకుగాను ప్రారంభించిన 420 కేంద్రాల ద్వారా 41వేల 526 మంది రైతుల నుంచి 2.65లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఈ జిల్లా మొత్తం ధాన్యం సేకరణ లక్ష్యం 4లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటి వరకు అందులో 70శాతం మాత్రమే సేకరించారు. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు జిల్లాల పరిధిలో 3.50లక్షల మెట్రిక్టన్నుల చొప్పున మొత్తం 7లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆ రెండు జిల్లాల్లో 3.5లక్షల మెట్రికల్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ పరిస్థితికి మరో కారణమూ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో వానాకాలం ప్రారంభంలోనే నాట్లు వేసిన రైతుల పొలాలు అక్టోబర్ చివరి వారం వరకే కోతలు పూర్తయ్యాయి. ఆ పొలాల్లో పంటంతా క్వింటాకు రూ.1700 నుంచి రూ.1800 చొప్పున దళారులకు, మిల్లర్లకే రైతులు అమ్ముకున్నారు. ఆలస్యంగా నాట్లు వేసిన పొలాల్లో ఎక్కువభాగం తాలు రావడం, సుమారు లక్షన్నర ఎకరాల్లో వరి కోయకుండా వదిలేయడం వంటి పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది వానాకాలం ప్రభుత్వం సేకరించాలకున్న ధాన్యం లక్ష్యం సగం కూడా దాటే పరిస్థితి లేదు.
పెట్టుబడీ రాదు
చెల్లోజు సతీష్- చొప్పదండి మండలం
రెండెకరాల్లో నాటు వేశాను. వానలు బాగా పడటంతో నాట్లు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు కోతకొచ్చే సమయానికి ధాన్యం గింజలన్నీ తాలు తప్ప మరేమీ లేదు. వరి కోసినా రెండు క్వింటాళ్లకు మించి ధాన్యం రాదు. పెట్టుబడీ రాక.. వరి కోసి మరో రూ.5వేలు అప్పు చేయలేక వదిలేశాను.