Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐకి ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ...
- ప్రగతి భవన్కు వెళ్లిన కవిత
- రాజకీయంగా.. చట్టబద్ధంగా గట్టిగా ఉండాలి
- ధైర్యం చెప్పిన కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మీరు నాకు చెప్పాలనుకున్న ప్రతీ విషయం కాగితం మీద రాతల రూపంలోనే ఉండాలి...' అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి స్పష్టం చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో... కేంద్ర హోం శాఖ సీబీఐకి చేసిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలంటూ ఆమె కోరారు. ఈ మేరకు శనివారం సీబీఐకి కవిత లేఖ రాశారు. మరోవైపు ఈ తతంగంపై చర్చించేందుకు ఆమె... శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్కు వెళ్లిన ఆమె... సాయంత్రం 4.30 గంటల వరకూ తన తండ్రితో పలు అంశాలపై చర్చించారు. ఈడీ, సీబీఐ... రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేతలను పెడుతున్న ఇబ్బందులపై వారు సమాలోచనలు చేశారు. 'ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా వెనకడుగేయొద్దు.. ఇదే సమయంలో చట్టపరంగానూ పకడ్బందీగా ఉండాలి. దర్యాప్తు సంస్థలకు, బీజేపీకి ఎంతమాత్రమూ అవకాశమివ్వొద్దు...' అంటూ ఆయన కవితకు సూచించారు. మానసికంగా కుంగిపోతే, భయపడితే బీజేపీ మరింత భయపెడుతుందంటూ ఆయన హెచ్చరించారు. 'దర్యాప్తు సందర్భంగా ఎలాంటి భయాందోళనలకు లోనుకావొద్దు...' అంటూ ఆయన తన కూతురిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించారని సమాచారం. సీఎంతో భేటీ అనంతరం కవిత... సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని మీడియాకు విడుదల చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులపై ఆమె ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం ఆమె వద్దకు రావాలనుకుంటున్నట్టు సీబీఐ శుక్రవారం కవితకు సమాచారమిచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ ఈ సమాచారమిచ్చింది. దానిపై కవిత స్పందిస్తూ... శనివారం సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వాటిని పంపించాలంటూ విజ్ఞప్తి చేశారు.