Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికపై సామూహిక లైంగికదాడి.. హత్య!
- న్యాయం చేయాలంటూ మృతదేహంతో రాస్తారోకో
- రెండు తండాల్లో ఉద్రిక్తత
- నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు : ఎమ్మెల్యే
నవతెలంగాణ- జడ్చర్ల / బాలానగర్
మహబూబ్నగర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తండ్రి తర్వాత తండ్రి అంతటి చిన్నాన్నే తన స్నేహితులతో కలిసి బాలికపై లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబీకులు శనివారం జడ్చర్ల మండల కేంద్రంలోని నేతాజీ చౌరస్తారో బాలిక మృతదేహాన్ని పెట్టి ఆందోళన చేశారు. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలోని ఓ తండాలో జరిగింది. బాధితులు, ఎస్ఐ జయప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కేశవతండాకు చెందిన బాలిక(16) తల్లిదండ్రులు శుక్రవారం పనిపై హైదరాబాద్ వెళ్లి.. ఆలస్యంగా కావడంతో అక్కడే ఉండిపోయారు. దాంతో రాత్రి ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. ఆ సమయంలో బంధువు.. వరుసకు బాబాయి అయిన శ్రీనునాయక్, చిన్న రేవల్లికి చెందిన అతని స్నేహితులు ఇంట్లోకి వచ్చి మద్యం తాగారు. అనంతరం బాలికపై లైంగికదాడికి ఒడిగట్టారు.. ఆ తర్వాత హత్య చేశారు. శనివారం ఉదయం తల్లిదండ్రులు వచ్చేసరికే విగతజీవిగా ఉన్న కూతురును చూసి గుండెలవిసేలా రోదించారు. ఇందుకు శ్రీనునాయక్, అతని స్నేహితులైన చిన్నరేవల్లికి చెందిన శివ, శ్రీనులే కారణమని బాలిక కుటుంబీకులు, బంధువులు వారి ఇండ్లపై దాడి చేశారు. చిన్నరేవల్లిలో శివ టీవీ రిపేర్ షాపులో సామగ్రిని ధ్వంసం చేశారు. కేశవతండాలో శ్రీనునాయక్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనం, కిరాణాషాపును తగలబెట్టారు. దాంతో రెండు తండాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టర్ వచ్చి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఐ జయప్రసాద్, జడ్చర్ల రూరల్ సీఐ జంబులప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, బాలిక మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో మృతదేహాన్ని పెట్టి దాదాపు రెండు గంటలకు పైగా బాధితులు రాస్తారోకో చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
బాలికపై బాలిక లైంగికదాడి, హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.