Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించినట్టు తెలిపారు. వ్యవసాయ అనుకూల విధానాలు, పుష్కలమైన నీటితో రాష్ట్రంలో ధాన్యం నాణ్యత మరింత పెరిగిందని చెప్పారు. ప్రయివేటులో సైతం మద్ధతు ధర కన్నా అధికంగా ధర రావడం మంచి పరిణామమని అన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా నిన్నటివరకూ 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వివరించారు. ఇందులో 36.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామనీ, వీటి విలువ రూ. 7,837 కోట్లని తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు రూ.4,780 కోట్లు చెల్లించామని తెలిపారు. 9.52 లక్షల గన్నీలు వాడమనీ, ఇంకా 9.16లక్షల గన్నీలు అందుబాటులోఉన్నాయని తెలిపారు. 729 కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయినట్టు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీక్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్ఫాలిన్లు తదితర అన్ని మౌలిక వసతులు సమకూర్చామని చెప్పారు. రైతులు ఎఫ్‌ఏక్యూతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు.