Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న గొడవతో మొదలై హత్యకు దారి తీసిన వైనం
- తమ్ముడిపై అన్న భార్య, కొడుకు దాడి
నవతెలంగాణ-దోమ
భూతగాదాల విషయంలో అన్న తమ్ముళ్లు మధ్య గొడవ జరిగి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దోమ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం కొండాయపల్లి గ్రామానికి చెందిన నెత్తి నర్సింహులు(35), నెత్తి బాల్‌రాజ్ ఇద్దరు అన్నతమ్ముళ్లు. అయితే కొన్నేండ్లుగా వీరిద్దరి మధ్య భూ తగాదాలు తలెత్తాయి. పది రోజుల కిందట వారి తల్లిపేరుపై ఉన్న 13 గుంటల భూమిని ఇతరులకు రూ.7,47,500లకు విక్రయాలు జరిపారు. సదరు వ్యక్తులు అడ్వాన్స్ కింద రూ. 2 లక్షలు ఇవ్వగా, బాల్‌రాజ్ రూ.1.80 లక్షలు తీసుకొని తమ్ముడు నర్సింహులుకు రూ.20 వేలు ఇచ్చాడు. దాంతో వారి మధ్య గొడవ ప్రారంభమయింది. అంతేకాకుండా, భూమి అమ్మగా వచ్చిన డబ్బుల్లో నుంచి చెల్లెలికి ఇవ్వాలని నర్సింహులు, బాలరాజ్‌ను అడగడంతో గొడవ మరింత రాజుకుంది. మాట, మాట పెరిగి గొడ్డలి, కర్రలతో దాడి చేసుకునేంత వరకూ వెళ్లింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలైనప్పటికీ గ్రామస్తుల చొరవతో ఇద్దరిని విడగొట్టారు. కాగా, కొడంగల్లో ఉంటున్న బాల్‌రాజ్ భార్య సునీత, కుమారుడు హరికి తమ్ముడితో గొడవ జరిగిందని బాల్‌రాజ్ సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న వారు కోపోద్రిక్తులై గ్రామానికి తిరిగి వచ్చి.. ఇంట్లో నిద్రిస్తున్న నర్సింహులుపై రోకలితో తలపై మోది దాడి చేశారు. ఈ క్రమంలో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో హత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమారం నిమిత్తం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని బావ బాబాయ్య ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సీఐ వెంకటరామయ్య, ఎస్‌ఐ విశ్వజన్ హత్యకు గల కారణాలను అరా తీశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.