Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటికి తీసుకెళ్లి, మద్యం తాగించి ఘాతుకానికి పాల్పడిన వైనం
- ప్రతిఘటించిన విద్యార్థిని,గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
- యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు
- ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన యాజమాన్యం
నవతెలంగాణ-మియాపూర్
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆచార్యులే మానవత్వం మరిచి విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం థారులాండ్ నుంచి యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థిపై ఓ ప్రొఫెసర్ లైంగికదాడికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థాయిలాండ్‌కు చెందిన యువతి ఉన్నత చదువుల కోసం సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చింది. హిందీ బోధించే ప్రొఫెసర్ రవిరంజన్ శుక్రవారం రాత్రి విద్యార్థినికి హిందీ నేర్పిస్తానని చెప్పి క్యాంపస్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో బాధిత యువతకి మద్యం తాగించాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను రవి రంజన్ కొట్టాడు. అనంతరం స్వయంగా కారులో తీసుకొచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు. అక్కడి నుంచి బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్ రవి రంజన్‌ను అదుపులోకి తీసుకొని, ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్‌పై మూడు కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. బాధితురాలు థాయిలాండ్ ఎంబసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది.
విద్యార్థి సంఘాల ఆందోళన..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు శనివారం ఉదయం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు హెచ్‌సీయూ మెయిన్ గేట్ ఎదుట బైటాయించి ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ప్రొఫెసర్ సస్పెండ్..
విద్యార్థిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్ రవి రంజన్‌ను సస్పెండ్ చేస్తూ హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిపై లైంగిక దాడి ఘటనపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో ఉన్నపళంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.