Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో అసమానతలు పెరిగే ప్రమాదం : ఎస్‌ఎఫ్‌ఐ సెమినార్‌లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని అమలు చేయడం వల్ల మహిళలు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యరంగంలో అసమానతలు పెరిగే ప్రమాదముందని విమర్శించారు. దేశంలో డ్రాపౌట్స్ పెరుగుతారనీ, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో 'నూతన విద్యావిధానం-మహిళల విద్య'అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. ఆ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే విద్యారంగంలో అసమానతలు పెరిగాయని అన్నారు. ఎన్‌ఈపీ అమలుతో పాఠశాలలు విలీనమవుతాయనీ, మహిళల విద్య కుంటు పడుతుందని వివరించారు. దేశంలో పురుషుల అక్షరాస్యత 82.4 శాతం ఉంటే, మహిళల అక్షరాస్యత 65.8 శాతం ఉందని చెప్పారు. నూతన విద్యా విధానం అమలైతే మహిళలు మరింత నష్టపోతారనీ, విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. గుజరాత్‌లో బిల్కిస్ బానోపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను విడుదల చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎన్‌ఈపీ అమల్లోకి వస్తే విద్యారంగంలో అసమానతలు మరింత పెరుగుతాయని చెప్పారు. ఇంకోవైపు ఉన్నత విద్యకు పేద విద్యార్ధులు దూరమయ్యే ప్రమాదముందన్నారు. విద్యారంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలనీ, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళలు ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసించేలా కేంద్రం ప్రోత్సహించాలని కోరారు. విద్యారంగంలో అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థినిలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి మాట్లడుతూ రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయానికి సరిపోయినన్ని నిధులు కేటాయించి సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలను ఉన్నత విద్యకు దూరం చేసే నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు వీరేందర్, సభ్యులు చరణ్ శ్రీ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.