Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు సాహిత్యంలో గిరిజన, ఆదివాసీయుల జీవన విధానం, సంస్కృతి, కళలు ఎక్కువగా నమోదు కాలేదని, భవిష్యత్తు తరాల కోసమైనా వారి సాహిత్యం విస్తృతంగా వెలువడాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో డాక్టర్ సూర్య ధనంజయ, రమేష్ కార్తీనాయక్ సంపాదకత్వంలో వెలువడిన 'కేసులా' గ్రంథ పరిచయ సభ శనివారం జరిగింది. ఈసందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గిరిజనులు మూలికా వైద్యులుగా, అటవీ సంరక్షకులుగా, పర్యావరణ పరిరక్షకులుగా, భూమి కోసం పోరాటం చేసిన యోధులుగా చరిత్రలో ప్రసిద్ధిలు లని తెలిపారు. అందుకే వారి సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక జీవనాన్ని అధ్యయనం చేయల్సిన అవసరం ఉందన్నారు. సాహిత్య అకాడమీ నిర్వహణలో ఆదివాసీ గిరిజన సాహిత్య శిక్షణా శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన మౌఖిక సాహిత్యాన్ని సేకరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. గిరిజన సాహిత్యం ఇతర భాషల్లో అనువాదం కావాలని, ఈ పని సాహిత్య అకాడమీ చేపట్టాలని కోరారు. సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ అధిపతి పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ.. సాహిత్య అకాడమీ ఆగాధలు దాటి గిరిజన గడప వద్దకు రావటం గొప్ప పరిణామమన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.