Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు నిలిపివేత
- విద్యాశాఖ ఆదేశాలు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రాథమిక స్థాయిలో మౌలిక భాషాగణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం (ఎఫ్‌ఎల్‌ఎన్) తొలిమెట్టు పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ నిలిపేసింది. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. తొలిమెట్టు పర్యవేక్షణ కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ గతనెల 19న ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పించకుండా, సకాలంలో పాఠ్యపుస్తకాలను ఇవ్వకుండా, విద్యా వాలంటీర్లను నియమించకుండా తొలిమెట్టు కార్యక్రమం అమలు ఎలా సాధ్యమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టాస్క్‌ఫోర్స్‌ను తొలగిం చాలంటూ పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. లేకుంటే ఉద్యమించాల్సి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను హెచ్చరించారు. ఎట్టకేల కు విద్యాశాఖ అధికారులు స్పందించి తొలిమెట్టు అమలు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌ను నిలిపేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు.
టాస్క్‌ఫోర్స్ పదాన్ని తొలగించాలి : టీఎస్‌యూటీఎఫ్
తొలిమెట్టు అమలు కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ పదాన్ని తొలగించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ కమిటీలో ఎన్జీవోలను తొలగించాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అనేది పోలీసు వ్యవస్థలో కొనసాగుతున్నదనీ, విద్యావ్యవస్థలోకి తేవడం అభ్యంతరకరమని వివరించారు. పాఠ్యప్రణాళిక స్థానంలో టీచింగ్ నోట్స్‌కు అవకాశమివ్వాలని పేర్కొన్నారు. బోధనేతర పనిభారాన్ని తగ్గించి అవసరమైన చోట విద్యావాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల ముందు ఉపాధ్యాయులను పాఠం చెప్పమనే భయానక వాతావరణాన్ని మినహాయించాలని కోరారు. పీరియెడ్ పనిభారాన్ని తగ్గించాలని సూచించారు. కనీస సామర్థ్యాలు లేదా సిలబస్ చెప్పాలనే స్పష్టత ఇవ్వాలని తెలిపారు. అభ్యసన సామర్థ్యాల్ని పరీక్షించే సమయంలో కేవలం విద్యార్థులను మాత్రమే పరిశీలించాలని పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ విజయవంతం కోసం ఉపాధ్యాయులపై పనిభారంతోపాటు మానసిక ఆందోళనలు తగ్గించి ప్రశాంత వాతావరణంలో బోధన సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేయాలి : టీఎస్‌పీటీఏ
ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఉత్తర్వులను నిలిపేయడం సమంజసం కాదనీ, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని టీఎస్‌పీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, పిట్ల రాజయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా, కనీసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలన్న నైతిక బాధ్యతను కూడా విస్మరించారని విమర్శించారు. గడిచిన రెండేండ్లుగా ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేసి విద్యాశాఖలో సంక్షోభం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.