Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ-హబ్ ద్వారా నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు : మాంటిస్సోరీలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
విద్యార్థులు తమలో ఉన్న సృజనాత్మకతను పెంచుకునేందుకు విజ్ఞాన ప్రదర్శన పోటీలను వినియోగించుకోవాలని, ఒకరి ఆలోచనలు ఇతరులు తెలుసుకోవడం వల్ల జ్ఞాన సంపద పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మాంటిస్సోరీ పాఠశాలలో జిల్లాస్థాయి విజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో టీఎస్‌ఎంఐ డడ్ల్యూసీ చైర్మెన్ రావుల శ్రీధర్‌రెడ్డి, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. మంత్రి ముందుగా సరస్వతిదేవి, సీవీ రామన్, శ్రీనివాస రామానుజన్‌ల చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా 10 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, నైపుణ్యత గల 17 విద్యార్థులకు ఐఐటి/నీట్ శిక్షణ కోసం ట్యాబ్‌ల పంపిణీ మొదలైన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ను ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ గ్రామంలో పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు ఆలోచించేలా ప్రోత్సహించాలని సూచించారు. మన ఊరు - మనబడి కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్య బోధన చేపట్టి పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మంత్రి కేటిఆర్ టీ-హబ్ ఏర్పాటు చేసారని, దాని ద్వారా నూతన ఆవిష్కరణలతో వచ్చేవారికి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యను ప్రోత్సహించేందుకు గురుకులాలు, కేజీబీవీ, మాడల్ పాఠశాలలు మొదలుకొని 1700 హాస్టల్ వసతితో విద్యా సంస్థలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. పేద ప్రజలు 10వ తరగతితో చదువు నిలిపివేయద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 1150 రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారని, అదే విధంగా డిగ్రీ, పీజీ కళాశాలలు, ప్రత్యేక న్యాయ కళాశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. కాగా, భూపాలపల్లి జిల్లాలో గురుకులాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలనే ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఎదగాలని, విద్యార్థులు బంగారు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ దివాకర్, టీఎస్ డబ్ల్యూఐ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీ హర్షిని, డీఈవో రాజేందర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపా ధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.