Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలను కొని బీజేపీయేతర సర్కార్లను కూల్చడమేనా ప్రధాని పని
- మోడీ సర్కారు వల్ల తెలంగాణకు రూ.3లక్షల కోట్ల నష్టం
- రాష్ట్ర నీటి వాటా తేల్చడానికి ఎనిమిదేండ్లు
- గుజరాత్‌లో ఉచిత విద్యుత్, తాగునీరు ఎందుకు ఇవ్వడం లేదు
- కేంద్రానికి రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్పాలి
- సొంత జాగా ఉంటే రెండు పడకల గదులకు రూ.3 లక్షలు
- త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఎమ్మెల్యేలను కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమేనా ప్రధాని పని అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ను ఆదివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని తమ ప్రభుత్వాలను ఏర్పరచుకుందని, అదే ప్రయోగాన్ని తెలంగాణలో చేయాలని చూస్తే చైతన్యవంతమైన ఎమ్మెల్యేలు వారికి తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. దశాబ్ద కాలంగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ ఉచిత విద్యుత్, తాగునీరు ఎందుకు సరఫరా చేయలేదని ప్రశ్నించారు. సొంత జాగా ఉంటే రెండు పడకల గదుల ఇంటి నిర్మాణం కోసం రూ. 3లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించి త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ.220 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు దాటినా నీటి వాటా తేల్చకపోవడం వివక్ష కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఓట్లతోనే గెలిచారు, తామూ అదే ఓట్లతో పరిపాలన చేస్తున్నామని, మరి అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రతిపక్షాల మీద దాడులు చేస్తే రాజ్యాంగంపై దాడి చేసినట్లేనని అన్నారు. రెండో దఫా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో పాలమూరు నుంచి ఎంపీగా గెలిచానని, ఈ జిల్లాకు తానూ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. పాలమూరు జిల్లా అంటే పేదలు, బాధలు, వలసలు ఉండేవని, గంజి కేంద్రాలతో ఆకలి నింపుకునే వారని, కానీ ఇప్పుడు పచ్చబడ్డ జిల్లాగా రూపొందిందని దీమా వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం ద్వారా సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నామన్నారు. మిషన్ భగీరథ, కాకతీయ వంటి పనులే గాక రిజర్వాయర్లు నిర్మించి భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేశామని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, తాగునీరు, రైతుబంధు, బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందజేస్తుంటే.. కేంద్రం మెచ్చుకోవాల్సింది పోయి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు.
పాలమూరులో ఐటీ సెక్టార్‌తో పాటు రూ.9,500 కోట్లతో బ్యాటరీ కంపెనీ రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇప్పుడు బైపాస్ రోడ్డుతో ప్రయాణికులకు కష్టాలు తీరాయని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల కోరిక మేరకు స్పోర్ట్స్ స్టేడియంలో ఆడిటోరియం నిర్మించడానికి రేపే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి సంక్షేమ పథకాలను చూసి ఆయా రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మన రాష్ట్రంలో కలపాలని కోరడం చూస్తుంటే తెలంగాణ సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణిదేవి తదితరులు పాల్గొన్నారు.