Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ ప్రజలు పోరాట యోధులు
- ప్రభుత్వ భూములు పేదలకు చెందాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య
- పోడుదారులకు పట్టాలు ఇవ్వాలి : వీరయ్య
నవతెలంగాణ-కాశిబుగ్గ
భూ పోరాటంలో పేదలు ఇండ్ల స్థలాలు కాపాడుకోవడంతో పాటు ఇంటి పట్టాలు, ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం పోరాడే క్రమంలో ప్రభుత్వంతో పాటు భూకబ్జాదారుల నుంచి ఇబ్బందులు తప్పవని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. వాటి ఎదుర్కొంటూనే సమస్యల సాధనకు పోరాడుతున్న ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్‌లోని పైడిపల్లి, కొత్తపేట భూపోరాట కేంద్రాలు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యులు అక్కనపెల్లి యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయనతో పాటు ఆ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఇండ్లు, విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎనిమిదేండ్లు గడుస్తున్నా పేదలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి తెచ్చి ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షల ఇస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014, 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. వరంగల్ ప్రజలు పోరాటయోధులని, నాడు భూమిశిస్తుకు వ్యతిరేకంగా కాకతీయులపై పోరాడిన సమ్మక్క సారలమ్మ, అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది వీరమరణం పొందాలని గుర్తు చేశారు.
ఆ పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలో జరిగిన భూ పోరాటంలో కుసుమ రఘునాథ్, రామ సురేందర్, సమ్మయ్య భూ కబ్జాదారుల చేతుల్లో దారణహత్యకు గురైనట్టు గుర్తుచేశారు. ప్రభుత్వ భూములను ఇండ్లు లేని పేదలకు పంచి వారికి పట్టాలిచ్చి ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వానికి పేదల గోడు వినే సమయం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యవసర సరుకులతో పాటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందన్నారు. కేంద్రం కనీస వేతన జీవో రూ.4678 లుగా విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి గుడిసెలు వేసుకునే హక్కు ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల గురించి కూడా ఆలోచించాలని కోరారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను న్యాయబద్ధంగా సర్వే చేయించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని భూ పోరాటాలు నిర్వహించాలని, అందుకు సీపీఐ(ఎం) పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సింగారపు బాబు, నళిగంటి రత్నమాల, ముక్కెర రామస్వామి, కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి ఎండి బషీర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.