Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండిసంజయ్‌కి ప్రశ్నించే నైతిక అర్హత లేదు
- కేరళ సర్కారు పాలనలో కనీస వేతనాల అమలు
- సీఐటీయూకే ప్రశ్నించే హక్కు ఉంది...: టీయుఎంహెచ్‌ఇయూ మహాసభలో జె.వెంకటేష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు పోస్టుల ఖాళీలను భర్తీ చేయదు. కనీస వేతనాలను డిమాండ్ చేస్తున్న అమలు చేయదు. కార్మిక హక్కులను హరిస్తూ నాలుగు కోడ్లను తెస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నది. రాష్ట్ర విభజన హామీల అమలును పట్టించుకోదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖాళీలు భర్తీ చేయరెందుకని ప్రశ్నిస్తుంటారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారును ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది. కేరళలోని ఎర్రజెండా సర్కారు రూ.18 వేల కనీస వేతనాలను అమలు చేస్తున్నది. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చేలా చట్టాన్ని రూపొందించే పనిలో ఉన్నది. చివరకు అగ్నిపథ్ పేరుతో సైన్యంలో కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చిన ఘనత బీజేపీదని అన్నారు. అందుకే కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించే అర్హత తమకే ఉందని''.... సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ అద్యక్షతన మూడో మహాసభ నిర్వహించారు. ఈ సభను వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యరంగానికి బడ్జెట్‌లో కనీసం ఆరు శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కనీసం ఒక శాతం కేటాయించలేదని విమర్శించారు. బీజేపీ హిందుత్వ పేరుతో విభజన రాజకీయాలు చేస్తూ, ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఆ పార్టీ దృష్టిలో హిందువులందరు సమానం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం పోరాడాల్సిన అవసరమున్నదని చెప్పారు. రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను టీఆర్‌ఎస్ సర్కారు పెంచడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ యాజమాన్యాల పక్షమా? లేక కార్మికుల పక్షమా? నిర్ణయించుకోవాలని తెలిపారు. వైద్యారోగ్యరంగ సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాలేదన్నారు. ఇది పోరాటానికి అనుకూల సమయమనీ, ఆ మేరకు ఉద్యోగులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
హైకోర్టు అడ్వొకేట్ మూర్తి మాట్లాడుతూ రెగ్యులరైజేషన్‌కు సంబంధించి చట్టపరమైన అంశాలు, కోర్టుల తీర్పులను వివరించారు. పదేండ్లు పని చేసిన వారిని పర్మినెంట్‌గానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం పోరాటాలు చేయాలనీ, చివరి అస్త్రంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. హైకోర్టు అడ్వొకేట్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో యూనియన్ అధ్యక్షురాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సీహెచ్.రోజారాణి మాట్లాడుతూ పోరాటాలు వృధా పోవనీ, ఫలితాలిస్తాయని తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో యూనియన్ ఏర్పాటై ఏడాది కాలమే అయినా 10 మందికి పైగా ఉద్యోగులకు లేబర్ కోర్టు వరకు వెళ్లి ఉద్యోగ భద్రత కల్పించిదని గుర్తుచేశారు. ఐక్యంగా ఉంటూ, మహిళలు యూనియన్‌లో నిర్ణయాత్మక కమిటీలలో బాధ్యతలు చేపట్టాలని సూచించారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. కాంట్రాక్ట్ పారామెడికల్, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను ఎలాంటి షరతులేకుండా యధావిధిగా రెగ్యులరైజ్ చేయాలి. ఇందు కోసం అవసరమైతే చట్ట సవరణ చేయాలి. పని ఒత్తిడి తగ్గించాలి. సెలవు దినాల్లో పని చెప్పకూడదు. సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. వేతన సవరణకమిటీని నియమించి జూలై ఒకటి నుంచి రెండో పీఆర్‌సీని అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 240 రోజులివ్వాలని మహాసభ తీర్మానించింది. ఈ మహాసభలో యూనియన కోశాధికారి మహమ్మద్ ఫసియుద్దీన్, నాయకులు మరియమ్మ, కవిత, బలరాం, సుధాకర్, సంజూ జార్జ్, వీరయ్య, వెంకటేష్, మీనా, శ్రావణ్ కుమార్, కుమారస్వామి, చంద్రమోహన్, రాజు, శ్రీనివాస్, భాస్కర్, నవీన్ కుమార్, విజయలక్ష్మి, సరోజన, విజయవర్థన్ రాజు తదితరులు పాల్గొన్నారు.