Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలివ్వాలి
- శ్రీనివాసరావు హత్యను ఖండించిన వామపక్ష పార్టీల బృందం
నవతెలంగాణ-చంద్రుగొండ
ఆదివాసుల బతుకు అడవితోనే ముడిపడి ఉందని సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు, సీపీఐ(ఎంఎల్, ప్రజా పంథా) నాయకులు మాచర్ల సత్యం, సీపీఐ ఎంఎల్ ఎన్‌డీ(రాయల వర్గం) నాయకులు ఎల్ విశ్వనాథం అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండల పాడు గ్రామపంచాయతీలోని ఎర్రబోడు గ్రామాన్ని వామపక్ష నాయకులు సందర్శించారు. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య గురించి ఆరా తీశారు. పోడు భూములను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అడవిలో 89 రకాల ఖనిజ సంపదలున్నాయని, వాటిని వారు కాపాడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవి సంరక్షణ పేరుతో ఆదివాసీ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం, పీసా, 1/70 చట్టాలు అడవికి అండగా, రక్షణగా ఉన్నాయన్నారు. ఎర్రబోడు వలస ఆదివాసీలను గ్రామం ఖాళీ చేయాలని ఫారెస్టు శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.