Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ఉపాధ్యాయుల యత్నం
నవతెలంగాణ- బంజారాహిల్స్
317 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉపాధ్యాయులు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకొని గోషామహల్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం రాత్రికి రాత్రే అసంబద్ధంగా తీసుకువచ్చిన 317 జీవోతో ఎంతో మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్థానికతను కోల్పోయారన్నారు. ఈ జీవో వల్ల ఎంతోమంది వారి వారి స్థానిక జిల్లాలను వదిలి వేరే సుదూర ప్రాంత జిల్లాలకు వెళ్లారని తెలిపారు. స్థానికత నినాదంగా ఏర్పడ్డ తెలంగాణలో తామందరం తమ స్థానికత కోల్పోయి ఉన్న ఊరిని, కన్నవారిని, ఆస్థిపాస్తులను వదిలి ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోతో ఎంతో మంది మనోవేదనకు గురై ఆత్మబలిదానాలు చేసుకున్నారని, అలాగే తామంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. జీవోను వెంటనే రద్దు చేసి తమను తమ స్థానిక జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఏరకంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదే విధంగా స్థానికతను సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.