Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదస్పద స్థలం కావడమే కారణం
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
కొన్ని గంటల్లో గృహ ప్రవేశం చేసుకోబోతున్నామన్న ఆ కుటుంబం సంతోషం నిమిషాల వ్యవధిలో ఆవిరైంది. వివాదాస్పద ప్లాట్ / స్థలంలో రెండు అంతస్థుల భవన నిర్మాణం చేపట్టారంటూ రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం తెల్లవారుజామున కూల్చివేశారు. రెవెన్యూ అధికారులు తెలిసిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ గ్రామ రెవెన్యూ సర్వేనెం 44 ,45 ప్లాట్ నెం.31 / స్థలం కోర్టు పరిధిలో ఉంది. ఆ స్థలంలో చెరుకు దేవి అనే వ్యక్తి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టడంతో ఆయనకు పలు దఫాలుగా రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా నిర్మాణదారులు కింది స్థాయి సిబ్బందిని బెదిరిస్తూ అక్రమంగా నిర్మాణం చేపట్టారు. దాంతో ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి ఆదేశాల మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 145 ప్రకారం రెండంతస్తుల ఇంటిని కూల్చివేశారు. కాగా, ఆ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం ఆదివారం జరగాల్సి ఉండగా.. అంతకంటే ముందే అధికారులు ఇంటిని కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో డిప్యూటీ తహసీల్దార్ వేణు, ఆర్‌ఐ భిక్షపతి, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.