Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతరానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వరాష్ట్రంలో స్వపరిపాలనను మొదలుపెట్టిన తొమ్మిదేండ్లలో సుమారు రెండు లక్షల 25వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కే తారకరామారావు తెలిపారు. ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను టీఆర్‌ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం భర్తీ చేసిందని వివరించారు. ఈ మేరకు ఆదివారంనాడాయన రాష్ట్ర యువతకు బహిరంగ లేఖ రాసారు. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేశామనీ, రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా చేపట్టామన్నారు. ఇప్పటికే సుమారు 32వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చామని గుర్తుచేశారు. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కషి చేశారనీ, అడ్డంకిగా వున్న రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయని తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ఫలించిందన్నారు. వమోపరిమితిని సడలించామనీ, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించామని చెప్పారు. త్వరలో మరో 10 వేల మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత అంశంపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదనీ, దీనిపై ఇప్పటిదాకా ఒక్క వివాదం నెలకొనలేదని గుర్తుచేశారు. ప్రయివేటు రంగంలో దాదాపు 17 లక్షలమందికి ఉపాధి కల్పించామన్నారు. తెలంగాణ యువత పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోవద్దనీ, అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టాలని చెప్పారు.