Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుట్టినరోజు వేడుకల్లో గంజాయి,
- 34 మంది అదుపులోకి
- విద్యార్థులు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
- పరారీలో ఉన్న ముగ్గురిపై కేసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీసులకు చిక్కకుండా కొందరు రేవ్పార్టీలను శివారు ప్రాంతాల్లోకి మార్చేశారు. గుట్టుచప్పుడుకాకుండా మాదక ద్రవ్యాలతో రేవ్ పార్టీలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఇంజినీరింగ్ విద్యార్థులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. 37 మందిలో 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు గంజాయి సేవించి ఉన్నారన్న అనుమానంతో వారిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు గుట్టు వెలుగు చూసింది. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, ఓ ద్విచక్రవాహనం, 30సెల్ఫోన్లు, డీజేసౌండ్ సిస్టమ్తోపాటు మద్యం బాటిళ్లు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌కు చెందిన కె.సాయి చరణ్ రెడ్డి, విశ్వచ రణ్‌రెడ్డి, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జి. హిమాచరణ్ రెడ్డి మరికొందరు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హయత్‌నగర్ శివార్లలోని ఫామ్‌హౌజ్‌ను లీజుకు తీసుకుని పార్టీలు నిర్వహిస్తున్న వారి స్నేహితులైన సనీత్ చారీ, రోహిత్, సన్నీకిరణ్ను వారు సంప్రదించారు.
దాంతో కొత్తపేట్‌లోని మోహన్‌నగర్‌లో 50గ్రాముల గంజాయి కొనుగోలు చేసిన రోహిత్.. పార్టీకి రూ.1200 తీసుకుని గంజాయి సప్లరు చేశాడు. అర్థరాత్రి సమయంలో పెద్దపెద్ద సౌండ్స్‌తో హౌరెత్తించే డ్యాన్స్‌ల మధ్య వారు వేడుక జరుపుకున్నారు. సిగరేట్లలో గంజాయిని నింపి పలువురు సేవించారు. ఈ క్రమంలో కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన వారు ఫామ్ హౌజ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో గోడదూకిన శ్రీనాథ్ చారీ, రోహిత్, సన్నీకిరణ్ ప్రస్తుతం పరారీలో ఉండగా మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో గంజాయి, మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే పట్టుకున్న వారంతా విద్యార్థులు కావడంతో ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో తహసీల్దార్ సంధ్య, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎహెచ్. వెంకటేశ్వర్లుతోపాటు మరికొంత మంది వారికి కౌన్సెలింగ్ చేశారు. వెంటనే స్పందించి రేవ్‌పార్టీని భగం చేయడంతో హయత్‌నగర్ పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, ఏసీపీ కే.పురెషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు, డీ.శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పిల్లలను గమనించాలి : సీపీ
తమ పిల్లలు ఎక్కడి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. సరదాల పేరుతో విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో సైతం మాదక ద్రవ్యాలు ఉపయోగించే అవకాశముందని, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.