Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగంలో అశాస్త్రీయ భావనలు
- సమాజానికి మంచిది కాదు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజాన్ని, లౌకికత్వాన్ని, సమాజ సంక్షేమాన్ని కాలరాస్త్తోందని, రాష్ట్ర హక్కులను హరించివేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం టిఎస్‌యుటీఎఫ్ 4వ విద్యా వైజ్ఞానిక సదస్సు కిషోర్‌సింగ్ అధ్యక్షతన ఆదివారం మణుగూరు పట్టణంలోని నాగటి నారాయణ ప్రాంగణంలో (జెడ్పీ కో ఎడ్యుకేషన్ పాఠశాల) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతోపాటు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ పునరుద్దరించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని బలోపేతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతుందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాభత్యాలు ఇవ్వడంలో మోసం చేస్తుందన్నారు. కోఠారి కమీషన్ విధానాలను అమలు చేసి బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలన్నారు. జ్యోతిష్యం, అశాస్త్రీయ భావాలు, మూఢనమ్మకాలు విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నారు. మూఢ నమ్మకాలు లేని విద్య శాస్త్రీయ ఆలోచనలు పెంచే విద్య, సమాజాభివృద్ధిని పెంపొందిస్తుందన్నారు. సమాజంలో రుగ్మతలు ఇంకా తొలగిపోలేదని, విద్యారంగం వలనే మూఢనమ్మకాలు తొలగించబడతాయని తెలిపారు. కేరళ తరహా విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. పాఠశాలలు మూతపడటానికి ప్రభుత్వ విధానాలే కారణమని, దానికి ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయడం సరికాదన్నారు. సామాజిక అంతరాలు తొలగించాలంటే విద్యను అభివృద్ధి చేయాలన్నారు. ముందుగా పట్టణంలో సంఘం సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఈవో సోమశేఖరశర్మ, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.