Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రబాబు ఎన్‌డీఏ కూటమిలోకి రావాలి
- తమతో కలిసొస్తే మళ్లీ జగనే సీఎం : కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం బంధువులున్నా శిక్ష పడాల్సిందేననీ, ఎంతటివారున్నా కచ్చితంగా శిక్ష పడుతుందని సామాజికన్యాయ, సాధికారత శాఖ కేంద్ర మంత్రి రామదాసు అథవాలే అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేటలో గల హరితప్లాజాలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ బీజేపీతోనే ఉంటుందన్నారు. త్వరలోనే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీయబోతున్నామని ప్రకటించారు. కేసీఆర్‌ది ఇప్పటి వరకూ లోకల్ పార్టీ అనీ, ఇప్పుడే జాతీయ పార్టీ ప్రారంభించారని తెలిపారు. వేరే రాష్ట్రాల్లో ఆయనకు అస్సలు సపోర్టే ఉండదన్నారు. లిక్కర్‌స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. ఆ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారనేది విచారణలో తేలుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్‌డీఏ కూటమిలో చేరాలని కోరారు. వైఎస్సార్‌సీపీ తమతో కలిసి వస్తే మరోసారి జగన్ సీఎం అవుతారన్నారు. బీజీపీ-ఆర్పీఐతో కలిసి వైఎస్సార్‌సీపీ పోటీచేస్తే జగన్‌ను గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
వికలాంగుల సమస్యల
పరిష్కారానికి కృషి చేస్తా : అథవాలే
వికలాంగుల సమస్యల పరిష్కారానికి తగిన విధంగా కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక, యువార్డు ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుమారుగా ఏడు శాతం మంది వికలాంగులు ఉన్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో సాధన మధుసూదన్‌రెడ్డి, హెలెన్ కిల్లర్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఉమరాన్, లక్ష సాధన ఇనిస్టిట్యూట్‌కు చెందిన పాపారావు తదితరులు పాల్గొన్నారు.