Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి అభివృద్ధే దేశాభివృద్ధిగా ప్రచారం
- మీడియా కూడా వారి గుత్తాధిపత్యంలోనే...
- కామ్రేడ్ ఆశిష్‌సేన్ జన్మదిన శతవార్షికోత్సవ సభలో ప్రొఫెసర్ జీ హరగోపాల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రమాదం సంభవిస్తుందని గ్రహించగానే మతోన్మాదాన్ని రెచ్చగొ డుతున్నారు. ప్రశ్నించకుండా భయాన్ని సృష్టిస్తున్నారు. మానవత్వాన్ని మరిచి మనిషి స్వార్థపరుడిగానే బ్రతకాలంటూ జీవితాలను సూత్రీకరిస్తున్నారు. దీనికి అనుగుణంగా మీడియా కూడా వారి గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. కార్పొరేట్ల అభివృద్ధే దేశాభివృద్ధి అని ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో, ప్రజల్ని వాస్తవాలవైపు మళ్ళించడంలో ఇతర రాజకీయపార్టీలు, బాధ్యత కలిగిన ప్రభుత్వరంగ ఉద్యోగులు విఫలం చెందుతున్నారు. అందువల్లే దేశంలో ప్రయివేటీకరణ ఎలాంటి ప్రతిఘటన లేకుండా సాఫీగా సాగిపోతున్నది'' అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జీ హరగోపాల్ విశ్లేషించారు. కామ్రేడ్ ఆశిష్‌సేన్ జన్మదిన శతవార్షికోత్సవాల సందర్భంగా ఏపీ-టీఎస్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఆఫ్ ఇండియా (టీఎస్), ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ (హైదరాబాద్), నాబార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (హైదరాబాద్) సంయుక్తాధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ''జాతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన-రుణపరపతి విధానం -ప్రయివేటీకరణ'' అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో అమానవీయత రాజ్యమేలుతున్నదనీ, నియో లిబరల్ విధానాలతో మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్నాయనీ, ఇది భవిష్యత్ తరాలకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణతో వచ్చే ప్రమాదాలను 33 కోట్ల మంది ఖాతాదారులకు అర్థమయ్యేలా చెప్పాలనీ, వారి మద్దతు ఉంటేనే ప్రజాక్షేత్రంలో విజయం సాధించ గలుగుతారంటూ ఢిల్లీ రైతాంగ పోరాటాన్ని ఉదహ రించారు. కేంద్రంలోని ప్రభుత్వ విధానాలవల్ల జరిగే నష్టాలను ఏరంగంలో ఉండే ఉద్యోగులు వారి వారి స్థాయిల్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ సరళీకృత ఆర్థిక విధానాలను తెచ్చి, అమలు చేసిందనీ, ఆపార్టీ కంటే అత్యంత వేగంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అవే విధానాలను అమలు చేస్తుండటంతో కార్పొరేట్లు మోడీ పక్షాన నిలుస్తున్నారని వివరించారు. ఈ విధానాల అమలుకు మత విశ్వాసాలను వాడుకుంటూ, వాటిని విద్వేషంగా మార్చే శక్తి ఉందని కార్పొరేట్లు గ్రహించారని చెప్పారు. సంస్కృతిని వినిమయ వస్తువుగా మార్చవచ్చని రుజువైందనీ, దీన్ని సమాజంలో గందరగోళపర్చడం ద్వారా మనుగడ సాగించొచ్చని కార్పొరేట్లు భావిస్తున్నారని తెలిపారు. అయితే ఇవి సుదీర్ఘకాలం నిలవబోవనీ, హిట్లర్ కూడా ఇలాంటి విధానాలే అమలు చేసి, విజయం సాధించాలని ప్రయత్నించారని ఉదహరించారు. సోషలిస్టు వ్యతిరేక భావజాలాన్ని అమెరికా అక్కడి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిందనీ, ఇప్పుడు భారతదేశంలోనూ ఇదే ఒరవడి కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రయివేటీకరణ కొత్త పుంతలు తొక్కుతూ అదానీ, అంబానీకరణవైపు సాగుతున్నదని విమర్శించారు. యావత్ దేశ సంపద వారి చేతుల్లోకి వెళ్ళిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం ద్వారానే ప్రభుత్వ రంగ పరిరక్షణ సాధ్యమవుతుందనీ, ఉద్యోగులే ఆ బాధ్యతల్ని స్వీకరించాలని చెప్పారు. విచిత్రంగా ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్యే విభేదాలు తలెత్తేలా ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే విధాన రూపకల్పన చేస్తున్నాయని ఉదహరించారు. వాటిని అధిగమిస్తూనే ప్రజా మద్దతుతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. బెఫీ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రామయ్య మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సమాన పనికి సమాన వేతనం ధ్వంసం అవుతున్నదని అన్నారు. ఎస్‌బీఐ వంటి సంస్థ తానే స్వయంగా ఔట్‌సోర్సింగ్ ఏజేన్సీ ఏర్పాటు చేసుకొని రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నదని చెప్పారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రమాదాలు, నష్టాల పట్ల ఉద్యోగులకే సరైన అవగాహన, అధ్యయనం ఉండట్లేదని అభిప్రాయపడ్డారు. ప్రజలను సమీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమానికి ఆర్‌ఆర్‌బీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. నాబార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ మోహన్‌కుమార్, ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ అర్గనైజింగ్ సెక్రటరీ తిలక్ తదితరులు పాల్గొన్నారు.