Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంపీస్కిన్ బారిన తెల్లజాతి పశువులు
- రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా 66 మృత్యువాత
- అనధికారికంగా వేలల్లో ఉండొచ్చని సమాచారం
- వ్యాధి బారిన 1877 గ్రామాల్లో 8,770 పశువులు
- గోట్ పాక్స్ టీకాతోనే సరి.. 2025 వరకూ ఒరిజినల్ వ్యాక్సిన్ కష్టమే..!
- ఒక్కో పశువుకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు వెచ్చిస్తున్న రైతులు
లంపిస్కిన్ బాధిత గ్రామాల నుంచి కె.శ్రీనివాసరెడ్డి
మొన్నటి వరకూ మనుషులను వణికించిన కోవిడ్-19 తరహాలోనే పశువులనూ ఐదారు నెలలుగా లంపీస్కిన్ వెంటాడుతోంది. ముఖ్యంగా తెల్లజాతి పశువులకు ఈ వైరస్ ఎక్కువగా సోకుతోంది. అందునా లేగ దూడలకు ఎక్కువగా వస్తున్నట్టు పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 1,877 గ్రామాల్లో 8,770 పశువులు ఈ వ్యాధి బారిన పడగా అధికారికంగా ఇప్పటి వరకు 66 పశువులు మృతిచెందినట్టు లెక్కలున్నాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 10 పశువులు మృతిచెం దాయంటున్నారు. కానీ అనధికారికంగా వందల్లోనే పశువులు మృతిచెంది ఉంటాయని సమాచారం.
చనిపోతున్నా.. మరణించనట్టు..!
ఖమ్మం జిల్లాలో 3,44,930 నల్ల, తెల్లజాతి పశువులుండగా 23 గ్రామాల్లో 27 పశువులకు ఈ వ్యాధి వచ్చిందని, ఒక్క పశువు కూడా మృతి చెందలేదని జిల్లా పశుసంవర్థకశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కానీ తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో ఈ వారంలోనే ఓ పశువు మృతి చెందగా గ్రామంలో సుమారు 10కి పైగా ఆవులు, దూడలు, ఎడ్లు వైరస్‌తో అవస్థపడుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. పక్కనే ఉన్న ఖమ్మం రూరల్ మండలం చింతపల్లిలో 3000 వరకు పశువులుండగా వందకు పైగా వైరస్‌తో ఇబ్బంది పడుతున్నాయని గ్రామస్తులు 'నవతెలంగాణ'కు తెలిపారు.
మేకల మశూచి టీకానే దిక్కు...
వ్యాక్సినేషన్ మొదలుపెట్టామని.. మేకల మశూచి టీకానే లంపీస్కిన్ నియంత్రణకు పంపిణీ చేస్తున్నట్టు పశుసంవర్థకశాఖ చెబుతోంది. రాష్ట్రంలో 68,37,540 పశువులకు వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 44% అంటే 30,08,572 పశువులకు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న పాలేరు, మధిర నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక విడత టీకా వేశామంటున్నా.. వ్యాధి బారిన పడే మూగజీవాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండే ఉత్తర భారతదేశం నుంచి పశువులను దళితబంధు లబ్దిదారుల కోసం హర్యానా నుంచి తీసుకురావడంపై లబ్దిదారులు మండిపడుతున్నారు. వ్యాధితీవ్రత అంతగా లేని ఆంధ్రప్రదేశ్ పశువులైతే స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయని అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.26 లక్షల పశువులకు గాను ఇప్పటి వరకు 1.31లక్షల పశువులకు మాత్రమే వ్యాక్సిన్ అందింది. ఇక్కడ 29 గ్రామాల్లో 25 ఎల్ఎస్డీ (లంపీస్కిన్ డిసీజ్) బారిన పడగా ఒక్కటి మాత్రమే మృతిచెందిందని పశుసంవర్థకశాఖ లెక్కలు చూపుతోంది.
ఒక్కసారిగా విజృంభణ
వాతావరణ అనుకూలతతో లంపీస్కిన్ డిసీజ్ అక్టోబర్ నుంచి విజృంభిస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్ వైరస్‌కు ప్రస్తుత చలి వాతావరణం కూడా తోడైందని పశువైధ్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో 20శాతం పశువులకు ఈ సోకే అవకాశం ఉందని పశుసంవర్థకశాఖ అంచనా. లంపీస్కిన్ లక్షణాలున్న పశువులున్న గ్రామాలకు 5 కి.మీ పరిధిలోని ఊళ్లలో వ్యాక్సినేషన్ చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో 42%, కొత్తగూడెంలో 40% పశువులకు మాత్రమే టీకాలు అందాయి.
ఒక్కోదానికి రూ.8వేలు ఖర్చు పెట్టా... : కటారి సహదేవ్, చింతపల్లి
నాకు పది శాల్తీల పశువులున్నాయి. రెండు బర్లు, 8 ఆవులు, ఎడ్లు ఉండగా వీటిలో మూడీంటికి వచ్చింది. రెండింటికి బాగా వస్తే రూ.1,200 గులుకోసులు పెట్టించా. ఒక్కోదానికి రూ.4వేలు పెట్టా. ఓ దూడకు బాగా వచ్చింది. తిరుమలాయపాలెం తీసుకుపోయిన.. మందులు రాసిచ్చారు.
కానీ ఒక్క మాత్ర కూడా పశువుల ఆస్పత్రిలో ఇచ్చింది లేదు. దూడకు ఒక్కరోజే రూ.6వేలు పెట్టా. ప్రయివేటుగా వైద్యం చేసేందుకు వచ్చే ఆయనకే విసుగు పుట్టి ఇంక వదిలేయిలే అన్నాడు. నెలరోజుల పాటు రూ.20వేలు పెట్టి వైద్యం చేయిస్తే అంతంతమాత్రంగా తగ్గింది. మావూళ్లో ఆస్పత్రి లేదు. మూడు కి.మీ దూరంలోని తిరుమలాయపాలెమో, ఆరెంపులో, ముత్తగూడెమో, వెంకటాయపాలెమో పోవాలి. ఆటోకు ఎక్కియ్యాలంటే వెయ్యి, పదిహేనొందలకు తక్కువ తీసుకోడు. మా గొడ్లకైతే ఇంత వరకూ వ్యాక్సిన్ వేయలేదు.
రూ.2వేలకు పైగా ఖర్చుపెట్టి ఖమ్మం తీసుకుపోయా..: గోవింద నాగయ్య, కొక్కిరేణి
దూడ వయస్సు 10నెలలు. దీనికి బాగా వచ్చింది. జ్వరం బాగా ఉంటుంది. దగ్గు, తుమ్ములు వస్తున్నాయి. తిరుమలాయపాలెం తీసుకుపోయినం. 15 రోజులుగా దీని అవస్థలు చూడలేకపోతున్నాం. ఊళ్లో ఐదారీంటికి వచ్చింది. ఒకటి చచ్చిపోవడంతో భయం వేసి రూ.1500 పెట్టి ట్రాలీ ఆటోలో తీసుకొని వచ్చి ఖమ్మంలో వైద్యం చేయించుకొని వస్తున్నా.
లంపీస్కిన్ నియంత్రణ టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నాం..: డాక్టర్ వేణుమనోహర్, ఖమ్మం జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి
ఇటీవల లంపీస్కిన్ బారిన తెల్లజాతిపశువులు, ముఖ్యంగా 5నుంచి 9నెలల వయస్సున్న దూడలు ఎక్కువగా ఈ డిసీజ్ బారిన పడుతున్నాయి. ఈ వ్యాధి వచ్చిన పశువులకు తీవ్ర జ్వరం, కంటి నుంచి నీరు కారడం, చర్మంపై పెద్దపెద్ద గడ్డలు, తీవ్రమైన ఒళ్లునొప్పులు, చర్మమంతా పొలుసులుగా మారడం, పశువు మేత తినదు. పాలివ్వదు. ఈ వ్యాధి బారిన పడిన ఆవుల పాలు తాగొద్దు. వ్యాధి సోకిన పశువులను మిగిలిన వాటికి దూరంగా ఉంచాలి. గోట్‌పాక్స్ టీకానే దీనికీ పంపిణీ చేస్తున్నాం. తెల్ల, నల్లపశువులన్నింటికీ వ్యాక్సిన్ వేస్తున్నాం. కలెక్టర్ చొరవతో మరో లక్ష డోసులు వచ్చాయి. జిల్లాలో 91వేల తెల్లపశువులకే ఇప్పటి వరకూ చేశాం. నల్లవాటికి కూడా ఇప్పుడు చేస్తున్నాం.