Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు అమరవీరుల స్ఫూర్తితో సమరశీల పోరాటాలు
- విప్లవ కార్యక్రమాలకు కడవెండి మూల కేంద్రం
- ఈ నెల 13 నుంచి 16 కేరళలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు
- కడివెండిలో అమరవీరుల స్ఫూర్తి యాత్రను ప్రారంభించిన సారంపల్లి
- హాజరైన కృష్ణ ప్రసాద్,ప్రకాశన్ మాస్టర్, సాగర్, పోతినేని
- జనగాం, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా ఏపీలోకి యాత్ర
కడివెండి నుంచి గుడిగ రఘు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్నదాతలపై బహుముఖ దాడి చేస్తున్నదని ఏఐకేఎస్ జాతీయ నేతలు విమర్శించారు. ప్రజలపై అది తీవ్రమైన భారాలు మోపుతున్నదని చెప్పారు. మరోవైపు దేశంలో ఆహార ధాన్యపు నిల్వలు ఉన్నా...బువ్వ దొరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో కేంద్రంపై సమరశీల పోరాటాలు చేయాలని వారు రైతులకు పిలుపునిచ్చారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై ఉద్యమించాలని కోరారు.ఆ పోరాటం భూ సమస్యను ఎజెండాగా మార్చడమే కాకుండా ప్రపంచ విప్లవాలకు మూల కేంద్రమైందని చెప్పారు. నిజాం పాలనలో అణచివేత, దోపిడీ, వెట్టిచాకిరి వంటి విధానాలకు వ్యతిరేకంగా కుల,మత తేడాలు లేకుండా ప్రజలు ఐక్యంగా పోరాడారని గుర్తు చేశారు. బీజేపీ, సంఘపరివార్ శక్తులు ఆ పోరాటం ముస్లింరాజుకు వ్యతిరేకంగా జరిగిదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈనెల 13 నుంచి 16 వరకు కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లో కొనసాగనున్న అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని సోమవారం జనగాం జిల్లా కడివెండి గ్రామం నుంచి రైతు అమరవీరుల జ్యోతి యాత్ర ప్రారంభమైంది. ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి జ్యోతిని వెలిగించి ఈ యాత్రను ప్రారంభించారు. అంతకు ముందుకు దొడ్డి కొమురయ్య స్థూపం వద్ద నివాళలర్పించారు. ఆ తర్వాత గుండ్రాంపల్లి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రారంభ సభలో ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి, రైతు అమరవీరుల జ్యోతి యాత్ర నాయకులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజీల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై తీవ్రమైన భారం మోపిందన్నారు. దేశంలోని రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూములు, మార్కెట్లు, గోదాములను కార్పొరేట్లకు అప్పగించేందుకు మోడీ సర్కారు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ఏడాదిన్నర కాలంపాటు రైతు పోరాడడంతోపాటు పోరాడి, 750 మంది రైతుల బలిదానంతో కేంద్రం ఆ చట్టాలు వెనక్కి తీసుకుందని చెప్పారు. రైతాంగ ఉద్యమాలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేంద్ర బిందువని గుర్తు చేశారు. సామ్రాజ్యవాదులనే కాకుండా నిజాం రాజును అది గడగడలాడించిందని చెప్పారు. జమిందార్లు, జాగీర్దార్లు, భూస్వామ్యులు ప్రజలను వేధింపులకు గురి చేసేవారనీ, వారికి ఆగడాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు ఐక్యమైన తిరుగుబాటు చేశారని వివరించారు. ఆ పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముందన్నారు. అమరవీరుల స్ఫూర్తిని రగిల్చించేందుకే కడివెండి గ్రామం నుంచి ఈ యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యాత్ర డిప్యూటీ లీడర్ టి సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేయాలని కోరారు. భవిష్యత్తులో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. మద్దతు ధరల చట్టం, రైతులకు నెలకు ఐదువేల పెన్షన్ సాధన కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగ ఉద్యమాల్లో అనేక మంది త్యాగాలు చేశారనీ, ఆ త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల జ్యోతి యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక పోరాటమన్నారు. ఆ పోరాట అనుభవాలను చైనా భాషలోకి తర్జుమా చేసుకుని, విప్లవ సమయంలో ఉపయోగించుకున్నారని గుర్తు చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, మార్కెట్లు రైతులకు అందుబాటులోకి లేకుండా కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రైతులు సంఘటితమైన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. నిజాం మూకలు గుండ్రాంపల్లిలో 150 మంది కార్యకర్తలను చంపి బావిలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాట స్ఫూర్తితో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందన్నారు. ఆ తర్వాత దేశంలో ఎన్నో బలమైన ఉద్యమాలు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు అమరవీరుల జ్యోతి యాత్ర మేనేజర్, మాజీ ఎమ్మెల్యే ప్రకాశన్ మాస్టర్, సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, జంగారెడ్డి, మాదినేని రమేష్, బండి రమేష్, బొంతు రాంబాబు, మధుసూధన్‌రెడ్డి, మూడ్‌శోభన్, లెల్లెల బాలకృష్ణ, మెకు కనకారెడ్డి, అశోక్‌రెడ్డి, కందాల ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కడవెండిలో ప్రారంభమైన యాత్ర మోత్కూరు, గుండ్రాంపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా కొనసాగి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది.