Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబర్ నాటికి ఇంటర్ సిలబస్‌ను పూర్తవుతుందని తెలిపారు. వచ్చేఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఎంసెట్ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు వివరించారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎంపిక చేసిన విద్యార్థులకు ఏప్రిల్, మేలో రెసిడెన్షియల్ పద్ధతిలో కోచింగ్ ఇస్తామని తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు కాలేజీ ప్రిన్సిపాళ్లు, సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీలో అర్హులైన విద్యార్థులను గుర్తించాలని వివరించారు. ఉచిత కోచింగ్ కోసం స్టడీ మెటీరియల్‌ను ఇంటర్ బోర్డు ఇస్తుందని తెలిపారు. రెగ్యులర్ తరగతులకు ఇబ్బంది లేకుండా జనవరి, ఫిబ్రవరిలో కోచింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిబ్రవరిలో స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. మెరిట్ విద్యార్థులకు గ్రూపుల వారీగా 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిలను ఏప్రిల్, మేలో రెసిడెన్షియల్ కోచింగ్‌కు ఎంపిక చేస్తామని వివరించారు. ఇందుకోసం మోడల్ స్కూళ్లు, గురుకులాలు, మైనార్టీ గురుకులాల్లో ఉచిత కోచింగ్ ఇస్తామని తెలిపారు.