Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో రోడ్లు అద్దంలా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో మంత్రి వేముల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత రెండు సీజన్లలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మేల్యేలతో సమన్వయం చేసుకోవాలనీ, వారు ప్రతిపాదించిన రోడ్లను పరిగణనలోకి తీసుకుని బాగు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ పునరుద్ధరణ, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 2,500 కోట్లు మంజూరు చేశారని ప్రకటించారు. ఈ నెల 15 లోపు టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారం వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు వేగంగా నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్రావు పలువురు ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.