Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శిగా స్కైలాబ్‌బాబు, సభ్యులుగా జాన్‌వెస్లీ,లలిత
- మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు: అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత్ సోషణ్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రాధాకృష్ణన్, రామచంద్రడోమ్ ఎన్నికయ్యారు. ఈ నెల నాలుగు నుంచి ఐదో తేదీ వరకు బీహార్‌లోని బెగుసరాయిలో ఆ సంఘం మూడో అఖిల భారత మహాసభలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ కార్యదర్శిగా టి స్కైలాబ్‌బాబు, సభ్యులుగా జాన్‌వెస్లీ, పల్లేర్ల లలిత ఎన్నికయ్యారు. జాతీయ కమిటి 69 మందితో ఎన్నికకాగా, అందులో 19 మందిని ఆఫీసు బేరర్లుగా ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకున్నది. ఈ మహాసభల్లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేదలు, దళితులు, గిరిజనులు.. మతోన్మాదానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. దేశంలో నూటికి 90 శాతం గా ఉన్న పేదలు భూమికి దూరంగా ఉన్నారనీ, కనీస కూలి రేట్లు అమలు కావడం లేదని తెలిపారు. ఈ నెలలో మతోన్మాదాన్ని ఎదిరించడానికి డిఎస్‌ఎంఎం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నాయని తెలిపారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పోడు భూముల కొసం ఆదివాసీలు, గుత్తి కోయలు, గిరిజనులు పోరాడుతున్నారనీ, అక్కడి నుంచి వారిని వెళ్లగొట్టేందుకు మోడీ ప్రభుత్వం పన్నుతున్నదని తెలిపారు. స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
వీఎన్కు నివాళి..జాన్ వెస్లీ
భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన మహత్తర వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కీల పాత్ర పోషించిన పోరాట యోధుడు మల్లు వెంకట నర్సింహారెడ్డి అని జాన్ వెస్లీ తెలిపారు. సోమవారం బీహార్‌లోని డీఎస్ఎంఎం మహాసభల ప్రాంగణంలో ఆయన చిత్ర పటానిక వెస్లీతో పాటు ఇతర నాయకులు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీ రేట్ల పెంపు కోసం సాగిన పోరాటాలకు వీఎన్ నాయకత్వం వహించారని గుర్తుచేశారు.కార్యక్రమంలో పాలడుగు నాగార్జున, కోట గోపితో పాటు తెలంగాణకు చెందిన వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.