Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ
- ఎస్ఎఫ్ఐ 'త్యాగపు ఆర్గాన్ పాటల సీడీ' ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థులను, ప్రజలను పిడికిళ్లు బిగిం పజేసేలా, చైతన్యం కలిగించేలా చేసేదే పాట అని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. విప్లవ సాహిత్యానికి సౌందర్యాత్మకమైన భావోద్వేగాన్ని రగిలించాలనీ, అందుకు తగ్గ పదాలను ఆ పాటలో జోడించాలని సూచించారు. ఏ అంశంపై పాట రాస్తున్నామో దాన్ని ఇష్టపడితే వచ్చే స్పందన, ఫలితం అద్భుతంగా ఉంటాయని చెప్పారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 17వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'త్యాగపు ఆర్గాన్'అనే పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అశోక్‌తేజ మాట్లాడుతూ 'గాలినై వచ్చాను గగనానికి అన్నట్టుగా పాటనై వచ్చాను మీటింగ్‌కు'అని చెప్పారు. విద్యార్థుల కోసం, రైతుల కోసం రాసే పాటల్లో వ్యత్యాసం ఉండాలన్నారు. ఇద్దరికీ ఒకే బాణితో పాటలు రాయలేమని అన్నారు. పాట బాణీని నిర్ణయించేది సాహిత్యం, సంగీతమేనని వివరించారు. పాట పల్లవి గెరిల్లా ముట్టడి లాగా ఉండాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ మహాసభల కోసం రాసిన ఈ పాటలు అలాగే ఉన్నాయని చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచే ఎస్ఎఫ్ఐతో అనుబంధం ఉందన్నారు. ఎనిమిదో తరగతిలో సైకిల్‌యాత్ర చేశానని గుర్తు చేశారు. 45 ఏండ్ల కింద ఉన్న విప్లవ సంస్కారం ఇప్పటికీ కొనసాగుతున్నదని అన్నారు. 'నేను లెఫ్ట్ అయ్యాను. కానీ నా భావజాలం, నా కంఠం, పెన్నులో నుంచి లెఫ్ట్... లెఫ్ట్ కాలేదు.'అని అశోక్‌తేజ చెప్పారు. తన ఎదుగుదలకు సుద్దాల హనుమంతు, జానకమ్మ కారణమని అన్నారు. పాటలు రాసిన ఎం విప్లవకుమార్, యోచన, ఎ విజయకుమార్, సంగీతం అందించిన రవి కళ్యాణ్‌ను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, రచయిత ఎం విప్లవకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపడం కోసమే తాను ఈ పాట రాశానని అన్నారు. అందరికీ సులభంగా అర్థమయ్యేలా, విద్యార్థులను ఆకట్టుకునేలా ఎస్ఎఫ్ఐ నినాదం, లక్ష్యాలు, పుట్టుక వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. 2005లో హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు జరిగినపుడు అశోక్‌తేజ రాసిన పాట స్ఫూర్తితోనే ప్రస్తుత ఈ పాట రాశానని వివరించారు. దాన్ని విద్యార్థుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రచయిత ఎ విజరుకుమార్ మాట్లాడుతూ పాట రాయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని అన్నారు. అయితే ఎస్ఎఫ్ఐ మహాసభల కోసం రాస్తానని అనుకోలేదన్నారు. అనుభవం లేని తానే పాట రాస్తే ఇంకా చాలా మంది రాయొచ్చని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి టి నాగరాజు, ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, గర్ల్స్ కన్వీనర్ ఎం పూజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినిపించిన రెండు పాటలకు విద్యార్థుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో పాటను అశోక్‌తేజ పాడి అలరించారు.